చెక్‌డ్యామ్ పునర్నిర్మించాలి..
1,250 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం
బోడు, కొప్పురాయి గ్రామాల రైతులు ఎమ్మెల్యేకు వినతి
టేకులపల్లి, (విజయక్రాంతి): టేకులపల్లి మండలం ఉమ్మడి బోడు పంచాయతీ పరిధిలోని పాతర్లగడ్డ వద్ద ముర్రేడు వాగుపై నిర్మించిన చెక్‌డ్యామ్‌ను పునర్నిర్మించి, పెండింగ్‌లో ఉన్న కాలువ నిర్మాణాన్ని పూర్తి చేయాలని బోడు ఉమ్మడి గ్రామపంచాయతీ, కొప్పురాయి గ్రామపంచాయతీ పరిధిలోని రైతులు ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యను కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యేకు మంగళవారం వినతిపత్రం అందజేశారు.
2003లో నిర్మాణం చేసి నేటికీ పూర్తికాని కాలువ పాతర్లగడ్డ వద్ద ముర్రేడు వాగుపై చెక్‌డ్యామ్ నిర్మాణానికి 2003లో శంకుస్థాపన చేసి, ఏడాది వ్యవధిలో నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు రైతులు తెలిపారు. అయితే చెక్‌డ్యామ్‌కు అనుసంధానంగా కాలువ నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు లేవని అధికారులు పనులను నిలిపివేశారని పేర్కొన్నారు. రెండేళ్ల తర్వాత అటవీశాఖ అనుమతులు వచ్చినప్పటికీ కాలువ నిర్మాణం చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు.
శిథిలావస్థకు చేరిన చెక్‌డ్యామ్
కాలువ నిర్మాణం పూర్తికాకపోవడంతో చెక్‌డ్యామ్ పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాలేదని రైతులు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం, నిర్వహణ లేకపోవడంతో ప్రస్తుతం చెక్‌డ్యామ్ శిథిలావస్థకు చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. 1,250 ఎకరాలకు ప్రయోజనం ఉన్న చెక్‌డ్యామ్‌ను పునర్నిర్మించి కాలువను పూర్తి చేస్తే సుమారు 1,250 ఎకరాలకు సాగునీటి సౌకర్యం అందుతుందని రైతులు తెలిపారు. బోడు ఉమ్మడి గ్రామపంచాయతీతో పాటు కొప్పురాయి గ్రామపంచాయతీ పరిధిలోని రైతులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. రైతుల సమస్యను దృష్టిలో ఉంచుకుని చెక్‌డ్యామ్ పునర్నిర్మాణం, కాలువ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసి పనులు త్వరితగతిన చేపట్టేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని ఎమ్మెల్యే కోరం కనకయ్యను రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు టీ షర్టు ఖాదర్ బాబు, కోరం సురేందర్, చిలువేరు చంద్రశేఖర్, మోకాళ్ళ పోషాలు, అన్నారపు రవికుమార్, పోదెం సుధీర్, వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.






