12 August, 2026 | 11:26 AM

బస్వాపూర్ లో ప్రమాదకర గుంతకు పోలీసుల తక్షణ మరమ్మతు

12-08-2026 10:12 AM

ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన కాటారం సీఐ నాగార్జునరావు

కాటారం, ఆగస్ట్ 12 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని కాటారం మండలం బస్వాపూర్ ప్రధాన రహదారిపై మాజీ స్పీకర్ శ్రీపాదరావు విగ్రహం సమీపంలో రుద్రారం వైపు వెళ్లే మార్గంలో ఏర్పడిన భారీ గుంత ప్రయాణికులకు ప్రమాదకరంగా మారింది. రాత్రివేళ గుంత కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ  మంగళవారం రాత్రి స్థానికులు ఈ విషయాన్ని కాటారం సీఐ నాగార్జునరావు దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న సీఐ వెంటనే స్పందించి పోలీసు సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదకరంగా మారిన గుంతను పరిశీలించి, తక్షణమే పూడ్చివేయించారు. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు ప్రమాదం తప్పింది. ప్రజల సమస్యను తెలుసుకున్న వెంటనే స్పందించి, సంబంధిత శాఖల కోసం వేచి చూడకుండా తక్షణ చర్యలు చేపట్టిన సీఐ నాగార్జునరావుపై స్థానికులు, ప్రయాణికులు అభినందనలు వ్యక్తం చేశారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పోలీసులు స్పందించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.