మారెళ్లపాడు పనులు ఆపేస్తారా!
రెండెకరాల 26 గుంటల భూమికి పరిహారం ఇవ్వలేరా..?
వారం రోజుల్లో సాగునీరు ఇవ్వాలి.. లేదంటే రైతులతో కలిసి ఉద్యమం: మాజీ సర్పంచ్ మర్రి మల్లారెడ్డి
అశ్వాపురం, ఆగస్టు 12(విజయక్రాంతి): తుమ్మలచెరువు ఆయకట్టు రైతులకు ఈ ఖరీఫ్ సీజన్‌లో సాగునీరు అందించేందుకు మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాల్సి ఉండగా, కేవలం రెండెకరాల 26 గుంటల భూమికి పరిహారం చెల్లించకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయని మాజీ సర్పంచ్, నెల్లిపాక సొసైటీ మాజీ అధ్యక్షుడు మర్రి మల్లారెడ్డి ఆరోపించారు.
ఆగస్టు 15న మారెళ్లపాడు నుంచి తుమ్మలచెరువుకు నీరు అందించి, ఈ ఖరీఫ్ పంటలకు సాగునీరు అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించిన నేపథ్యంలో, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ పరిహారం సమస్యను పరిష్కరించి పనులను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే నాట్ల సమయం దాటిపోతుండటంతో తుమ్మలచెరువు ఆయకట్టు రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఈ ఖరీఫ్‌లో వరి పంటకు నీరు అందక రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. వారం రోజుల్లోగా పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని, లేనిపక్షంలో సీతారామ మోటార్లను అడ్డుకోవడంతో పాటు మండల రైతాంగాన్ని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని మర్రి మల్లారెడ్డి హెచ్చరించారు.






