15-02-2026 12:00:00 AM
బంగ్లాదేశ్‌లో ఎన్నికల క్రతువు ముగిసింది. అంతా ఊహించినట్లుగానే తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బీఎన్పీ) అధికారాన్ని కైవసం చేసుకుంది. 300 స్థానాలున్న బంగ్లాదేశ్ పార్లమెంటులో బీఎన్పీ కూటమి 212 స్థానాలు గెలు చుకోగా, జమాతే ఇస్లామీ కూటమి 77 స్థానాలకే పరిమితమయ్యింది. మాజీ ప్రధాని షేక్ హసీనా పదవీచూత్యురాలైన తర్వాత నిరసనలతో అట్టుడికిపోయిన బంగ్లాదేశ్‌లో బీఎన్పీ విజయం కొత్త ఊపిరినిచ్చింది.
అయితే బంగ్లాదేశ్‌లో అవినీతికి, అణచివేతకూ వ్యతిరేకంగా ఉద్యమించిన జెన్ జీ తరాన్ని అడ్డుపెట్టుకొని దేశాన్ని ఛాందసవాదం ఊబిలోకి నెట్టాలని ఆరాటపడిన మతశక్తుల మంత్రం పనిచేయలేదు. హసీనా పార్టీ అవామీ లీగ్‌పై నిషేధం ఉండడం, గత పాలనలో బీఎన్పీ అవినీతి పార్టీగా పేరు తెచ్చుకోవడంతో ఈ పార్టీల కథ ముగిసినట్లేనని జమాతే ఇస్లామీ సహా ఇస్లామిక్ శక్తులు భావించాయి. కానీ బంగ్లాదేశ్ ప్రజలు మాత్రం అల్లకల్లోలంగా ఉన్న తమ దేశంలో సుస్థిర, ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పాటు అవసరమని గుర్తించారు.
అందుకు తగ్గట్లే వివేకంతో ఆలోచించిన బంగ్లా ఓటర్లు బీఎన్పీకి పట్టం కట్టారు. హసీనా వైదొలిగిన తర్వాత ఆర్థిక నిపుణుడు మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాన్ని నడిపించారు. కానీ ఆయన మతోన్మాదాన్ని రెచ్చగొట్టడమే ధ్యేయమన్నట్టుగా ప్రవర్తించారు. మైనార్టీ హిందూ పౌరులపై, అవామీ లీగ్ నేతలపై, ఆ పార్టీ అనుబంధ సంఘాల నేతలపై ఉన్మాద గుంపులు దాడులు, హత్యలు చేస్తుంటే పట్టించుకోలేదు. మతాచారాలు పాటించటం లేదని మహిళలను హింసిస్తే వాటివైపు కన్నెత్తి చూడలేదు.
పైగా హసీనా వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించిన వారిని చేరదీసి, నేషనల్ సిటిజన్ పార్టీ(ఎన్సీపీ)ని ఏర్పాటు చేయించి, భారత వ్యతిరేకిగా ముద్రపడ్డ జమాతే ఇస్లామీతో పొత్తు కుదర్చారు. కానీ బంగ్లా ప్రజలు యూనస్ ఆలోచనను పూర్తిగా పక్కనబెట్టి తమకేం కావాలనేది ఓటు తీర్పుతో స్పష్టతనిచ్చారు. ఎన్నికలతోపాటు రాజ్యాంగ సంస్క రణలపై నిర్వహించిన రిఫరెండమ్ విషయంలో బీఎన్పీ అప్రమత్తంగా ఉండాలి.
ప్రధాని పదవికి రెండు దఫాల పరిమితి, స్వతంత్ర న్యాయవ్యవస్థ, మహిళలకూ, యువతకూ పటిష్టమైన ప్రాధాన్యత, పార్లమెంటుకు రెండు సభల ఏర్పాటు అందులో ఉన్నాయి. అయితే గతంలో బీఎన్పీ అధికారంలో ఉన్న రెండు దఫాలు ఖలీదా జియా మతతత్వ, భారత వ్యతిరేక శక్తులకు ప్రోత్సాహాన్నందించారు. కానీ ఈసారి పదవి చేపట్టనున్న తారిఖ్ రెహమాన్ ఆలోచనలు మాత్రం ఆయన తల్లి ఖలీదా జియాకు భిన్నంగా ఉన్నాయి.
ఏ దేశమైనా సరే గొడవలకు పోకుండా సామరస్య పద్ధతితో నడుచుకుంటామని తారిఖ్ తన ప్రసంగాల్లో పేర్కొన్నారు. అంతేకాదు పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలోనూ వాణిజ్యం సహా బంగ్లా ప్రజలకు మేలు చేసే విషయాలనే ఎక్కువగా ప్రస్తావించారు. బంగ్లాదేశ్‌లో బీఎన్పీ గెలిచిన వెంటనే భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. తారిఖ్ పాలనలో భారత్, బంగ్లాదేశ్ బంధం మెరుగుపడుతుందా అన్నది చూడాలి.
అయితే భారత్‌కు దూరంగా ఉండాలని తారిఖ్‌పై జమాతే పార్టీ ఒత్తిళ్లు తెచ్చే అవకాశం లేకపోలేదు. ఇవేవి పట్టించుకోకుండా నిజాయితీగా పాలిస్తే రెహమాన్ రాజకీయంగా నిలదొక్కుకుంటారు. అలా కాదని వ్యవహరిస్తే మా త్రం ఓటమిపాలైన జమాతే వంటి శక్తులు బలపడే ప్రమాదముంది.