చెక్ పవర్ పంచాయితీ!
- జాయింట్ చెక్ పవర్‌పై మళ్లీ రగడ
- ఉమ్మడి నియంత్రణ వద్దంటున్న సర్పంచ్‌లు
- రద్దు చేస్తే పారదర్శకత లోపిస్తుందంటున్న ఉప సర్పంచ్‌లు
- సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కొత్త ఎత్తుగడ
- ఉప సర్పంచ్ సంతకానికి వారం రోజులు డెడ్‌లైన్
- గడువు దాటితే కలెక్టర్‌దే నిర్ణయం
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ(Gram Panchayat)ల్లో ‘జాయింట్ చెక్ పవర్(Joint check-signing authority)’ వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. నిధులు(Funds), చెల్లింపులు(Payments), ఇతర ఆర్థిక లావాదేవీల(Financial transactions)కు సంబంధించి సర్పంచ్(Sarpanch)తో పాటు ఉప సర్పంచ్(Deputy Sarpanch) సంతకం(Signature) తప్పనిసరి కావడంతో ఇరువర్గాల మధ్య విభేదాలు నెలకొంటున్నాయి. ఉమ్మడి విధానం తమ అధికారాలకు అడ్డంకిగా మారుతోందని, సర్పంచ్‌లు వాదిస్తుండగా.. నిధుల దుర్వినియోగాన్ని అడ్డు కోవడంతో పాటు జవాబుదారీతనం, పారదర్శకతకు జాయింట్ చెక్ పవర్ తప్పనిసరని ఉప సర్పంచ్‌లు అంటున్నారు.
జాయింట్ చెక్ పవర్‌ను తొలగించి సర్పంచ్‌లకే పూర్తి ఆర్థికాధికారాలు కల్పించాలని సర్పంచ్‌లు డిమాండ్ చేస్తున్నారు. అభివృద్ధి పనులు(Development works), అత్యవసర ఖర్చులు(emergency expenses), బిల్లుల చెల్లింపులు(bill payments).. ఇలా ప్రతి దశలో ఉప సర్పంచ్ సంతకం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వారు ఆరోపిస్తున్నారు.
దీంతో పాలనలో నిర్ణయాలు వేగంగా తీసుకోలేకపోతున్నామని, నిధులు వినియోగంలో జాప్యం జరుగుతుందని అంటున్నారు. ఇరువర్గాల మధ్య వివాదం ముదురుతున్న నేపథ్యంలో సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జాయింట్ చెక్ పవర్‌ను తొలగించకుండా.. ఉప సర్పంచ్‌ల సంతకానికి టైమ్ లిమిట్ విధించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
విభేదాలతో అభివృద్ధి పనులకు ఆటంకం
పంచాయతీల్లో నిధుల వినియోగం ఒకే వ్యక్తి చేతుల్లో కేంద్రీకృతం కాకుండా చూడాలనే ఉద్దేశంతో జాయింట్ చెక్ పవర్ విధానం అమల్లోకి తెచ్చారు. పంచాయతీ ఖాతా నుంచి నిధులు విడుదల చేయాలంటే సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్ సంతకం కూడా ఉండటం వల్ల ఆర్థిక వ్యవహారాల్లో పరస్పర పర్యవేక్షణ ఉంటుందని ప్రధాన ఉద్దేశం. తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, డ్రెయినేజీ, అంతర్గత రహదారులు, అత్యవసర మరమ్మతులు వంటి పనులకు వెంటనే చెల్లింపులు చేయాల్సిన సందర్భాలు ఉంటాయి. ఇలాంటి సమయంలో చెక్‌పై సంతకం చేయాల్సిన ఉప సర్పంచ్ సహకరించకపోతే నిధులు ఉన్నప్పటికీ పనులు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడుతోందని సర్పంచ్‌లు వాదిస్తున్నారు. రాజకీయంగా సర్పంచ్, ఉప సర్పంచ్ వర్గాలు వేర్వేరుగా ఉంటే సమస్య మరింత తీవ్రమవుతోందని చెబుతున్నారు. వ్యక్తిగత విభేదాలు, స్థానిక రాజకీయ ఆధిపత్య పోరు, గ్రామంలో వర్గపోరు వంటి అంశాలు ఆర్థిక వ్యవహారాలపై ప్రభావం చూపుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
టైమ్ లిమిట్ ఆలోచన..
ఇరువర్గాల వాదనల నేపథ్యంలో ప్రభుత్వం మధ్యేమార్గాన్ని అనుసరించే అవకాశం కనిపిస్తోంది. జాయింట్ చెక్ పవర్‌ను పూర్తిగా రద్దు చేస్తే ఉప సర్పంచ్‌ల నుంచి వ్యతిరేకత రావడం ఖాయం. అదే సమయంలో సంతకం చేయకుండా చెక్‌లను పెండింగ్‌లో ఉంచితే పంచాయతీల సాధారణ పరిపాలన దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రతిపాదిత విధానం ప్రకారం చెక్‌ను సర్పంచ్ సిద్ధం చేసిన తర్వాత ఉప సర్పంచ్‌కు సంతకం చేసేందుకు నిర్ధిష్ట గడువు ఇవ్వనున్నారు. ఈ గడువు వారం రోజులుగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఆ వ్యవధిలో ఉప సర్పంచ్ సంతకం చేయాలి. సంతకం చేయకపోతే.. కారణాన్ని నమోదు చేయాల్సి రావచ్చు. కారణం లేకుండా చెక్ను పెండింగ్‌లో ఉంచితే తదుపరి నిర్ణయాధికారాన్ని జిల్లా కలెక్టర్‌కు అప్పగించే విధానం తీసుకురావాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే గ్రామ పంచాయతీల్లో ఇప్పటివరకు కొనసాగుతున్న అధికార సమీకరణంలో గణనీయమైన మార్పులు రావచ్చు. ప్రస్తుతం సర్పంచ్, ఉప సర్పంచ్ మధ్య ఏకాభిప్రాయం లేకపోతే చెక్ ముందుకు కదలని పరిస్థితి ఉంటే.. కొత్త విధానంలో ఆ ప్రతిష్ఠంభనకు ఒక పరిష్కారం లభిస్తుంది.
వివాదాస్పద అంశాల్లో కలెక్టర్ స్థాయిలో పరిశీలనకు అవకాశం కల్పించడం ద్వారా రెండు వర్గాల మధ్య సమతుల్యత సాధించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా వేలాది గ్రామ పంచాయతీలు ఉండటంతో ప్రతి చెక్ వివాదం జిల్లా స్థాయికి వస్తే పరిపాలనా పరంగా సమస్యలు తలెత్తే అవకాశముంది. అందువల్ల కలెక్టర్‌కు నిర్ణయాధికారం ఇచ్చే ముందు స్పష్టమైన మార్గదర్శకాలు, కారణాల పరిశీలన, సంబంధిత అధికారుల స్థాయిలో ప్రాథమిక విచారణ వంటి అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
ఆధిపత్య పోరుకు చెక్?
జాయింట్ చెక్ పవర్ వివాదం కేవలం ఆర్థిక అంశంగా మాత్రమే కాకుండా స్థానిక రాజకీయాలకూ ముడిపడి ఉంది. సర్పంచ్, ఉప సర్పంచ్‌లు ఒకే రాజకీయ వర్గానికి చెందినవారు కానప్పుడు పరస్పర విభేదాలు చెక్‌లపై ప్రభావం చూపుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఒకరి ఆధిపత్యాన్ని మరొకరు అడ్డుకునే ప్రయత్నంలో అభివృద్ధి పనులు నిలిచిపోతే చివరికి నష్టపోయేది గ్రామ ప్రజలేనన్న వాదన ఉంది. అదే సమయంలో జాయింట్ చెక్ పవర్ పూర్తిగా తొలగిస్తే సర్పంచ్‌కు అధిక ఆర్థిక స్వేచ్ఛ లభించే అవకాశం ఉండటంతో పర్యవేక్షణ వ్యవస్థ బలహీనపడుతుందనే భయం ఉప సర్పంచ్‌లలో ఉంది.
అందుకే ప్రభుత్వం తీసుకునే నిర్ణయంలో అభివృద్ధి వేగం, ఆర్థిక పారదర్శకత, ప్రజాప్రతినిధుల జవాబుదారీ తనంఈ మూడు అంశాలను సమన్వయం చేయాల్సిన అవసరం ఉంది. జాయింట్ చెక్ పవర్‌పై కొనసాగుతున్న వివాదం చివరకు అధికారాల పంపిణీపై ప్రశ్నలను లేవనెత్తుతోంది.
సంతకం చేసే అధికారం ఎవరిది అన్నదానికంటే.. నిధులు ఎక్కడ, ఎలా ఖర్చవుతున్నాయి? వాటికి ఎవరు బాధ్యత వహించాలి? అభివృద్ధి పనులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? అనే ప్రశ్నలకు సమాధానం అవసరం. జాయింట్ చెక్ పవర్ ఉద్దేశం పారదర్శకత అయితే.. అభివృద్ధి పేరుతో ఆర్థిక నియంత్రణలు పూర్తిగా తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడమే ప్రభుత్వానికి అసలు సవాల్‌గా మారింది.
జాయింట్ పవర్ అవసరమే..
గ్రామ పంచాయతీ నిధులు ప్రజాధనం. వాటి ఖర్చుపై ప్రజాప్రతినిధులందరికీ బాధ్యత ఉండాలని ఉప సర్పంచ్‌లు అంటున్నారు. సర్పంచ్‌కు మాత్రమే చెక్ పవర్ ఇస్తే ఆర్థిక వ్యవహారాలపై రెండోస్థాయి పర్యవేక్షణ లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాయింట్ చెక్ పవర్‌ను రద్దు చేయడం కంటే.. ఎక్కడైనా సంతకం విషయంలో సమస్య ఉంటే దానికి పరిష్కార మార్గాన్ని రూపొందించాలని కోరుతున్నారు. నిబంధనను తొలగించడం ద్వారా సమస్య పరిష్కారం కాదని, బదులుగా గ్రామ పంచాయతీల్లో ఆర్థిక పారదర్శకతకు మరింత పటిష్ఠమైన వ్యవస్థ అవసరమని పేర్కొంటున్నారు. అధికారాలను తగ్గించే ప్రయత్నం జరిగితే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు.