సీఎం సారూ.. పార్కులోకి పిల్లల్ని అనుమతించండి !
- పార్కుల పరిరక్షణ కోసం సీఎంకు ఇంటర్ విద్యార్థి బహిరంగ లేఖ
పార్కులో పిల్లల నిషేధంపై ఇంటర్ విద్యార్థి ఫిర్యాదు
రామచంద్రాపురం కాకతీయ నగర్లో ఘటన
సీఎం, డీజీపీ, హెచ్‌ఎండీఏ, మున్సిపల్ కమిషనర్లకు ఫిర్యాదులు చేసినా స్పందన కరువు
సంగారెడ్డి బ్యూరో, సెప్టెంబర్ 10 (విజయ క్రాంతి): బహిరంగ పార్కుల్లో పిల్లలు స్వేచ్ఛగా ఆడుకునే హక్కును పరిరక్షించాలని, పార్కుల ఆక్రమణలను అరికట్టి ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరుతూ రామచంద్రాపురం కాకతీయ నగర్కు (Ramachandrapuram Kakatiya Nagar)చెందిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థి సి.అనిరుధ్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. పార్కుల పరిరక్షణ కో సం తాను చేస్తున్న పోరాటానికి అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో విద్యార్థి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సమస్య పరిష్కారం కోసం తాను పలుమార్లు ఉన్నతాధికారులను ఆశ్రయించినట్లు అనిరుధ్ తెలిపారు. మే 4, 11 తేదీల్లో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ను, మే 11న హెచ్‌ఎండీఏ కమిషనర్ను, మే 16న సైబరాబాద్ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదులు అందించినట్లు పేర్కొన్నారు.
మే 17న రామచంద్రాపురం ఏసీపీని కలిసేందుకు ప్రయత్నించగా సిబ్బంది అనుమతించలేదని లేఖలో వాపోయారు. అంతేకాకుండా ఈ విషయంలో తనపై తన తండ్రిపై కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారని ఆరోపించాడు.
సీఎంకు లేఖ..
జూన్ 27న సీఎం కార్యాలయానికి అందజేసిన లేఖలో అనిరుధ్ పలు కీలక డిమాం డ్లు చేశారు. తనపై జరిగిన దాడి, బెదిరింపులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణలో పిల్లలు బహిరంగ పార్కుల్లో స్వేచ్ఛగా ఆడుకునే హక్కును కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ సహా ప్రభుత్వ అధికారులు రాజకీయ ప్రయోజనాలకు కాకుండా ప్రజాసేవకు, ప్రజలకు జవాబుదారీతనానికి ప్రాధాన్యమిచ్చేలా చర్యలు తీసుకుని వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని పునరుద్ధరించాలని ఆయన ఆ లేఖలో కోరారు.