14 August, 2026 | 10:49 PM

సీఎస్ సంజయ్ జాజు పలు అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్

14-08-2026 09:41 PM

పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ 

అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేసిన కలెక్టర్ 

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం నుండి ఎల్ నినో ప్రభావం వల్ల వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగు, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, సోమవారం ఎంపిడిఓ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహణ తదితర అంశాలపై సీఎస్ సంజయ్ జాజు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్ కు ఐడిఓసి కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ వ్యవసాయ, ఉద్యాన వన శాఖ, ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో ప్రస్తుత పంటల సాగు పరిస్థితి, సాగు విస్తీర్ణం, ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రోత్సాహం, నీటిపారుదల వసతులు, నీటి వనరుల లభ్యత తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో సాగు పురోగతిపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్న కలెక్టర్, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించి ఖచ్చితమైన, నివేదికలు అందించాలని ఆదేశించారు. సాగు వివరాల నివేదికలలో ఎలాంటి వ్యత్యాసాలకు తావులేకుండా, సమాచారాన్ని క్రమబద్ధంగా  నమోదు చేయాలని సూచించారు.

వరి పంటలకు ప్రత్యామ్నాయంగా పప్పు దినుసులు సాగు చేసేలా ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులకు కలెక్టర్ సూచించారు. పంట మార్పిడి వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలపై గ్రామీణ స్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో రైతులతో కలిసి పనిచేయాలని, మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమంలో అధికారులు తప్పనిసరిగా పాల్గొని పంటల మార్పిడిపై అవగాహన కల్పించాలని సూచించారు.

ప్రత్యామ్నయ పంటల సాగుపై రైతులకు అవసరమైన వ్యవసాయ సలహాలు, సూచనలు నిరంతరం అందించాలని సూచించారు. చెరువులు, ఇతర నీటి వనరుల్లో త్రాగు అవసరాలకు  సమర్థవంతంగా వినియోగించడంతో పాటు భూగర్భ జలాలు పెరిగేలా నీటి సంరక్షణ చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సమావేశానికి గైర్హాజరయిన భూపాలపల్లి డివిజన్ ఇరిగేషన్ ఈఈ కి షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, వ్యవసాయ,  ఉద్యాన, ఇరిగేషన్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.