15 June, 2026 | 1:28 AM

భాగ్యవిధాతలు పిల్లలు

15-06-2026 12:00 AM

పిల్లలు పరమాత్ముని ప్రసాదాలు ---

పుడమికొచ్చిన పూర్వజన్మ పుణ్యఫలాలు

ఇంటింటి ఇంద్ర ధనస్సులు

ఇలవేల్పుల ఆనంద తరంగాలు

పిల్లలు పూలతోటలో పూసిన పుష్పాలు ---

పరిమళాల పూదండలు

పసితనపు పవిత్ర గీతాలు

ప్రేమకు ప్రతిరూపాలు 

పెద్దచదువులు చదివించు ---

పరిపూర్ణ జ్ఞానమందించు

పుస్తకాల వెలుగులు పంచు

పరిశోధన పథంలో నడిపించు

ప్రపంచాన్ని అర్థం చేసుకునే దృష్టినివ్వు 

ప్రయోజకులను చెయ్యి --- పదవులకోసం కాదు

పరులకు ఉపయోగపడే మనుషులుగా తీర్చు

పరోపకారమే పరమధర్మమని నేర్పు

పాటుపడే పౌరుషాన్ని అలవర్చు 

ప్రశస్త పౌరులుగా తీర్చిదిద్దు ---

దేశభక్తి కలిగించు

ధర్మబద్ధ దారులు చూపించు

నిజాయితీ నిధులను నాటించు

నైతికతను నిత్యసహచరిగా చేయించు

పిల్లలు కుటుంబానికి కీర్తి కిరీటాలు

సమాజానికి సజీవ సంపదలు

దేశానికి దివ్య ధనరాశులు

భవిష్యత్తుకు బంగారు బాటలు 

పిల్లలే రేపటి భారత నిర్మాతలు ---

పిల్లలే భావి భారత భాగ్యవిధాతలు

పిల్లలే వికాసపు విజయ ధ్వజాలు

పిల్లలే మన ఆశయాల సాకార రూపాలు

 గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్