పాపం.. ఇందిరా పార్కు !
15-06-2026 12:00 AM
లోయర్ ట్యాంక్ బండ్
పక్కనుంచి వస్తుంటే
ఇందిరా పార్క్ దగ్గర ఆగి
లోపలికి అడుగులు వేశా..
పార్క్ అంతా కలియదిరిగా
పిల్లల నవ్వులు.. పెద్దల ఊసులు
అప్పటి బెంచీలేవు అక్కడ లేవు..
సిబ్బంది కొత్త బెంచీలు
బిగిస్తున్నారు
రంగు డబ్బాలు దింపుతున్నారు
కొత్త మొక్కలూ దిగుతున్నాయి
వాటిలో ఇంతకు ముందెన్నడూ చూడని పూల మొక్కలున్నాయి
కానీ, వాటిలో జీవం లేదు..
అక్కడి కొలనులో తిరిగిన
హంసలెప్పుడో గగనానికి
ఎగిరిపోయాయి
సరస్సులో తిరిగిన చేపకళ్లు ఏ చూపుల గాలానికో
విలవిలలాడాయి
నిటారుగా పెరిగి తలలు వాల్చిన వృక్షాలు కొన్ని జ్ఞాపకాల
బరువుకు ఒరిగిపోతున్నాయి
వర్ణాల రెక్కల్ని తెంపుకున్న
సీతాకోకచిలుకలు
గోడలకు రంగులు వేస్తున్న పెయింటర్ సన్నని
చేతివేళ్లయ్యాయి
నాటి ఆ ఊహలు ఇప్పటికీ ఇంకా అక్కడి పచ్చికలోనే
దొర్లుతున్నాయి






