20 May, 2026 | 2:44 AM

అనుమతుల్లేని స్కూల్‌ను మూసివేయండి

20-06-2024 12:05 AM

సుచిత్రలోని శ్రీచైతన్య పాఠశాల ఎదుట ధర్నా

మేడ్చల్, జూన్ 19(విజయక్రాంతి): సుచిత్ర వెన్నెలగడ్డ మూడుగుళ్ల ఎదురుగా ఉన్న శ్రీచైతన్య స్కూల్ ఎదుట బుధవారం బడ్జెట్ పాఠశాలల యజమానులు సుమారు 150 మంది ధర్నా చేశారు. శ్రీ చైతన్య స్కూల్‌ను ఎలాంటి అనుమతుల్లేకుండా ఐదంతస్తుల భవనంలో ఏర్పాటు చేశారని స్థానికులు విద్యాశాఖా అధికారులకు ఫిర్యాదు చేశారు. మండల విద్యాధికారులు మే నెలలో సీజ్ చేశారు. ఇవేమీ పట్టించుకోకుండానే పాఠశాల యాజమాన్యం 300 మంది విద్యార్థుల నుంచి అడ్మిషన్లు తీసుకున్నది. విషయం తెలుసుకున్న బడ్జెట్ పాఠశాలల యజమానులు శ్రీచైతన్య స్కూల్‌ను ప్రారంభి స్తే విద్యార్థులు రోడ్డున పడుతారని, తమ పాఠశాలలకు విలువ లేకుండా పోతుందని పేర్కొంటూ  అక్కడికి చేరుకుని ధర్నా నిర్వహించారు.

పక్కనే ఉన్న ఓ పాఠశాలకు 15 అడుగుల దూరంలోనే స్కూల్‌ను ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు. నిబంధనలు పాటించని శ్రీచైతన్యపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. వీరికి ఏబీవీపీ కార్యకర్తలు మద్దతు తెలిపారు. అనంతరం సెక్రటేరియట్‌లో ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంటకేశంను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ ధర్నాలో రాష్ట్ర ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.ఎన్.రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రామేశ్వర్‌రెడ్డి, కుత్బుల్లాపూర్ మండలాధ్యక్షుడు చింతల మహేశ్ యాదవ్, కార్యదర్శి రవి పాల్గొన్నారు.