24 July, 2026 | 10:05 PM

వారం రోజుల పాటు పెద్దపల్లి–కునారం రైల్వే గేట్ మూసివేత

24-07-2026 09:34 PM

జూలై 25 నుంచి 31 వరకు రాకపోకలకు నిలిపివేత

ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించాలని రైల్వే అధికారుల సూచన

పెద్దపల్లి,(విజయ క్రాంతి): పెద్దపల్లి–కునారం ప్రధాన రహదారిపై ఉన్న రైల్వే గేట్ వద్ద అత్యవసర ట్రాక్ మరమ్మత్తు పనులు చేపట్టనున్న నేపథ్యంలో వారం రోజుల పాటు రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. అధికారుల వివరాల ప్రకారం, జూలై 25 ఉదయం 6 గంటల నుంచి జూలై 31 సాయంత్రం 7 గంటల వరకు రైల్వే గేట్ మూసివేయబడుతుంది. ట్రాక్ భద్రతను మరింత మెరుగుపర్చే లక్ష్యంతో ఈ మరమ్మత్తు పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో ప్రయాణికులు, వాహనదారులు ముందుగానే తమ ప్రయాణాలను ప్రణాళిక చేసుకుని ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని అధికారులు సూచించారు. గేట్ మూసివేతపై జిల్లా యంత్రాంగం, పోలీసు, ట్రాఫిక్ శాఖ, ఆర్టీసీ అధికారులు, లారీ, ఆటో సంఘాల ప్రతినిధులు, సంబంధిత గ్రామాల సర్పంచ్‌లు, ప్రెస్ క్లబ్‌కు ముందస్తుగా సమాచారం అందించినట్లు వెల్లడించారు. మరమ్మత్తు పనులు పూర్తయిన వెంటనే రైల్వే గేట్‌ను తిరిగి తెరిచి రాకపోకలను యథావిధిగా పునరుద్ధరిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులకు కలిగే తాత్కాలిక అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.