24 July, 2026 | 10:23 PM

కాచాపూర్‌లో మద్యం నిషేధానికి గ్రామసభ తీర్మానం

24-07-2026 09:43 PM

భిక్కనూర్,(విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం కాచాపూర్ గ్రామంలో సర్పంచ్ పాలమాకుల జ్యోతి సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో మద్యం సేవనం, బెల్ట్ షాపుల నిర్వహణను పూర్తిగా నిషేధించాలని గ్రామసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ యువత మద్యానికి బానిస కాకుండా, ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పిచ్చిమొక్కల తొలగింపు, మురికి కాలువల శుభ్రత వంటి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే అవకాశమున్నందున ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, నీటిని పొదుపుగా వినియోగించాలని గ్రామస్తులకు సూచించారు. ఈ గ్రామసభలో ఉపసర్పంచ్ దశరథం, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువత, గ్రామస్థులు పాల్గొన్నారు.