దివ్యాంగ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి
- వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశం
బోధన్,(విజయక్రాంతి): వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి దివ్యాంగ మహిళలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దివ్యాంగుల కమిషనర్ నియామకాన్ని మూడు రోజుల్లో పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం స్వాగతించదగిన విషయమే అయినప్పటికీ, రిటైర్డ్ వ్యక్తిని నియమిస్తామని చెప్పడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
దివ్యాంగులలో ఉన్నత విద్యాభ్యాసం చేసిన, సమర్థత కలిగిన మహిళలు ఎంతోమంది ఉన్నారని, వారికి అవకాశం కల్పిస్తే దివ్యాంగుల సమస్యలపై సమర్థవంతంగా పనిచేసి న్యాయం చేయగలరని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లే, ఎస్సీ మహిళలకు ఎస్సీ కమిషన్‌లో అవకాశం కల్పించిన విధంగా దివ్యాంగ మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
101వ రాజ్యాంగ సవరణ అనంతరం కమిషన్, చైర్మన్ వంటి కీలక పదవుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించాలని, రాష్ట్రంలో దివ్యాంగులను సమాన హక్కులు కలిగిన పౌరులుగా గుర్తించి వారికి రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. సమాజంలో దివ్యాంగులకు గౌరవప్రదమైన స్థానం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా దివ్యాంగ మహిళల సాధికారత కోసం తగిన అవకాశాలు కల్పించాలని సుజాత సూర్యవంశం ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు రాష్ట్రంలోని దివ్యాంగ మహిళల తరఫున ఆమె విజ్ఞప్తి చేశారు.






