16 May, 2026 | 2:09 AM

క్యాన్సర్ బాధితులకు సీఎం భరోసా

16-05-2026 12:55 AM

వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక స్క్రీనింగ్ సెంటర్లు 

హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి): క్యాన్సర్ చికిత్స హైదరాబాద్‌కే పరిమితం కాకుండా, క్యాన్సర్ బాధితులు అధికంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు నోరి దత్తాత్రేయ శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని నివాసంలో కలిసి అట్లాస్ ఆఫ్ తెలంగాణ నివేదిక అందజేశారు.

నివేదికను పరిశీలించిన అనంతరం సీఎం మాట్లాడారు. దత్తాత్రేయ ఇచ్చిన నివేదిక ఆధారంగా క్యాన్సర్ బాధితులు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించడంతో పాటు అందుకు కారణాలను అన్వేషించే అవకాశం ఏర్పడిందన్నారు. అంతేకాకుండా నివేదిక ఆధారంగా క్యాన్సర్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో స్క్రీనింగ్ సెంటర్ల ఏర్పాటు సులువుకానుందన్నారు.  ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ ఆస్పత్రుల్లో క్యాన్సర్ చికిత్సను మరింత సమర్థవంతంగా అందించాలని  సూచించారు.

తెలంగాణలో క్యాన్సర్‌పై సమగ్ర నివేదిక అందజేసిన నోరి దత్తాత్రేయను సీఎం అభినందించారు. క్యాన్స ర్ నిర్మూలనకు అట్లాస్ ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ  కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, భువనగిరి ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టియానా పాల్గొన్నారు. నేడు ఢిల్లీకి రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ మేరకు సీఎంఓ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.