16 May, 2026 | 2:08 AM

వేగవంతంగా ధాన్యం సేకరణ

16-05-2026 12:56 AM

కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ 

సూర్యాపేట, మే 15 (విజయక్రాంతి) : క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న అడ్డంకులను అధిగమిస్తూ, ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతూ రైతులు పండించిన ధాన్యంను వేగవంతంగా సేకరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. శుక్రవారం ఆయన ఆత్మకూరు (ఎస్), నూతనకల్ మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను, స్థానిక రైస్ మిల్లులను సందర్శించి, కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో ప్రధానంగా ఎదురవుతున్న లారీల కొరత, హమాలీల ఇబ్బందులు మరియు అన్లోడింగ్ సమస్యలను గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు లారీల కొరత లేకుండా రవాణా శాఖ మరియు పోలీస్ అధికారుల సమన్వయంతో అన్ని రకాల వాహనాలను ధాన్యం సేకరణకు మళ్లిస్తున్నామన్నారు. రైస్ మిల్లుల వద్ద అన్లోడింగ్ ఆలస్యం కాకుండా ఉండేందుకు ప్రతి మిల్లుకు ఒక ప్రత్యేక ఇన్ఛార్జ్ను నియమించామనీ తెలిపారు.

ఎక్కువ మంది హమాలీలను ఏర్పాటు చేసి ఆన్ లోడింగ్ వేగవంతం చేస్తున్నామని చెప్పారు. మండల స్థాయిలో కొనుగోళ్ల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు మండల ప్రొక్యూర్మెంట్ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. రెవెన్యూ, సివిల్ సప్లై మరియు పోలీస్ శాఖలు సమన్వయం చేసుకుంటూ ధాన్యం సేకరణను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక కోఆర్డినేటర్లు క్షేత్రస్థాయిలో పని చేస్తున్నారని పేర్కొన్నారు.

అకాల వర్షాల దృష్ట్యా అలర్ట్ మెకానిజం సిద్ధం చేశామని కలెక్టర్ వెల్లడించారు. ఒకవేళ అకాల వర్షాల వల్ల ధాన్యం తడిస్తే, రైతులు ఆందోళన చెందవద్దని అటువంటి ధాన్యాన్ని వెంటనే గుర్తించి బాయిల్ రైస్ మిల్లులకు తరలించేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట ఆత్మకూర్ ఎస్ తాసిల్దార్ హమీసింగ్, నూతనకల్ తాసిల్దార్ శ్రీనివాసరావు ఇతర అధికారులు తదితరులు ఉన్నారు.