ఢిల్లీ బయల్దేరిన సీఎం.. రేవంత్‌రెడ్డితో పాటు కేకే
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ను కలిసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. సీఎంతో పాటు కె.కేశవరావు ఢిల్లీకి పయనం అయ్యారు. ఇవాళ ఎంపీ పదవికి కేకే రాజీనామా చేయ నున్నట్లు వార్తలొస్తున్నాయి. సాయంత్రం 5 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నారు. అటు తన మంత్రివర్గ విస్తరణకు పార్టీ హైకమాండ్ అనుమతిని కోరడంతో పాటు కొత్త టీపీసీసీ అధ్యక్షుడిని కూడా ఖరారు చేయనున్నారు.
మంత్రివర్గ విస్తరణ కోసం రేవంత్ రెడ్డి ఇప్పటికే తన కోరికల జాబితాను సమర్పించారు. కాగా, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన సతీమణి, పాత నల్గొండ జిల్లాకు చెందిన కోదాడ ఎమ్మెల్యే ఎన్.పద్మావతిరెడ్డికి మంత్రి పదవి కోసం గట్టిగా లాబీయింగ్ చేస్తున్నారు. పార్టీ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మంత్రివర్గంలో చేరేందుకు సీఎం మద్దతు పలికారు. వచ్చే వారంలో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది.






