23-11-2025 11:20:37 AM
హైదరాబాద్: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో హిల్ వ్యూ ఆడిటోరియంలో శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరుగుతున్నాయి. సత్యసాయి జయంతి ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, తమిళనాడు మంత్రి శేఖర్ బాబు, ఛత్తీస్ గఢ్, మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు హాజరయ్యారు. అంతకుముందు స్వర్ణ రథంపై శ్రీ సత్యసాయి బాబా చిత్రపటాన్ని ఊరేగింపుగా కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనల నడుమ వేదిక వద్దకు తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడం అరుదైన అవకాశం అని, ఆయన ప్రేమతో మనుషులను గెలిచి, సేవలతో దేవుడిగా కొలవబడుతున్నారని పేర్కొన్నారు. ప్రేమ ద్వారా ఏదైనా సాధించవచ్చని సత్యసాయిబాబా నిరూపించారని, ఆయన ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. ప్రభుత్వాలు కూడా చేయలేని పనులను సత్యసాయిబాబా ట్రస్టు నెరవేర్చిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
ప్రతి ఒక్కరికి చదువు అందించాలని నమ్మి కేజీ నుంచి పీజీ వరకు పేదలకు ఉచితంగా విద్య అందించారని సీఎం పేర్కొన్నారు. చివరి దశలో ఉన్న లక్షల మంది పేదలకు సరైన వైద్యం అందించారని, పాలమూరు వంటి వలస జిల్లాకు తాగునీటి సదుపాయం కల్పించారు. అనంతపురం జిల్లాకు కూడా తాగునీటి వసతులను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకే కాకుండా తమిళనాడులో తాగునీటి సమస్యను పరిష్కరించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.