పోరాట చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేక స్థానం

17-09-2026 | 10:39am
  1. ధిక్కార స్వరం వినిపించిన నేల తెలంగాణ
  2. యోధులకు పుట్టినిల్లు తెలంగాణ
  3. నిజాం పాలనలో హైదరాబాద్ కు ప్రపంచ స్థాయి గుర్తింపు

హైదరాబాద్: తెలంగాణ.. పొరుగు రాష్ట్రాలతోనే కాదు ప్రపంచంతో పోటీపడుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) పేర్కొన్నారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం 2026(Telangana Praja Palana Dinotsavam 2026) వేడుకల్లో  ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల స్వేచ్ఛ, ఆత్మగౌరవం, హక్కుల కోసం పోరాడిన యోధులకు సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. తరతరాల అణచివేత, దోపిడీ, భూస్వామ్య, పెత్తందారీ విధానాలపై ధిక్కార స్వరం వినిపించిన నేల తెలంగాణ అన్నారు. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పోరాడిన యోధులకు పుట్టినిల్లు తెలంగాణ అన్నారు.

అస్తిత్వం, ఆత్మగౌరవం, హక్కుల కోసం ఈ నేల ప్రజా చైతన్యాన్ని రగిలించిందని సీఎం గుర్తుచేశారు. సుదీర్ఘ పోరాట చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. సమ్మక్క-సారలమ్మ పోరాటం నుంచి సాయుధ పోరాటం వరకు అన్యాయాన్ని ఎదిరించడం ఈ గడ్డ స్వభావమని స్పష్టం చేశారు. నిజాం పాలనలో హైదరాబాద్ ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించిందని కొనియాడారు. అదే సమయంలో గ్రామీణ తెలంగాణలో(Rural Telangana) భూస్వామ్య దోపిడీ, వెట్టి చాకిరి, అణచివేతలు జరిగాయన్నారు. చివరిదశలో రజాకారుల దౌర్జన్యాలు ప్రజలను కల్లోల పరిచాయని గుర్తుచేశారు. భారతదేశంలో అంతర్భాగం కావాలన్న ఆకాంక్ష ప్రజల్లో బలపడిందని సూచించారు. 

నిజాం ఆంధ్ర మహాసభ, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్(Hyderabad State Congress) ఆధ్వర్యంలో ఉద్యమాలు చేశారని తెలిపారు. రజాకారుల ఆగడాలకు వ్యతిరేకంగా భూమి, భుక్తి కోసం కమ్యూనిస్టులు పోరాటం చేశారని కొనియాడారు. రావి నారాయణరెడ్డి, భీంరెడ్డి నర్సింహారెడ్డి, చాకలి ఐలమ్మ వంటి యోధులు పోరాటాలకు నాయకత్వం వహించారని చెప్పారు. హైదరాబాద్ ప్రజల ఆకాంక్ష మేరకు నెహ్రూ, పటేల్ నాయకత్వంలో సైనిక చర్య చేపట్టారని గుర్తుచేశారు. ఆపరేషన్ పోలో అనంతరం ఏడో నిజాం భారత ప్రభుత్వానికి లొంగిపోయారని తెలిపారు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ అధికారికంగా భారత్ లో అంతర్భాగమైందని స్పష్టం చేశారు.

రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనకు మార్గం తెరుచుకున్న చారిత్రక సందర్భంగా సెప్టెంబర్ 17ను(September 17) ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నామని వివరించారు. ప్రజల ఆత్మగౌరవానికి పట్టం కడుతూ ప్రజా పాలన కొనసాగిస్తున్నామని వెల్లడించారు. పెండింగ్ ప్రాజెక్టులు(Pending projects) యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి తెలంగాణను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఆడబిడ్డ సగర్వంగా జీవించాలి.. ఆర్థిక స్వావలంబన సాధించాలనేది ప్రభుత్వ ఆలోచన అన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 4.18 లక్షలుగా ఉందని చెప్పారు. దేశ తలసరి ఆదాయం కంటే 91 శాతం అధికంగా ఉందన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోసం న్యాయపోరాటం చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు.


మరిన్ని వార్తలు