ఢిల్లీలో మూడో రోజు రేవంత్ రెడ్డి పర్యటన
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy ) మూడో రోజు హస్తినలో పర్యటిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం మధ్యాహ్నం ఇండియా ఏఐ సమ్మిట్- 2026లో(India AI Summit 2026) పాల్గొనున్నారు. స్వీడన్ వ్యాపార ప్రతినిధుల బృందంతో శ్రీధర్ బాబు సమావేశం కానున్నారు. భరత్ మండపం వెస్ట్ వింగ్ లో జరిగే కార్యక్రమంలో శ్రీధర్ బాబు పాల్గొననున్నారు. గురువారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సారథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi), ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమక్షంలో కీలక భేటీ జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని(Congress party) మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన కార్యచరణ, రెండేళ్ల ప్రజా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, ఇటీవల గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల సాధించిన ఫలితాలపై సుదీర్ఘంగా చర్చించామని సీఎం రేవంత్(CM Revanth) పేర్కొన్నారు. వ్యవసాయరంగంలో తెలంగాణ రైతులు సాధిస్తున్న విజయాలు, దేశంలోనే ధాన్యం ఉత్పత్తిలో నంబర్ వన్ స్థానంలో నిలిచిన విధానం గురించి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల గురించి అడిగి తెలుసుకున్న రాహుల్ గాంధీ నేతలకు పలు కీలక సూచనలు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క, సహచర మంత్రివర్గ సభ్యులు పాల్గొన్నారు.






