బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
హైదరాబాద్: ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం(World Day Against Child Labour) సందర్భంగా సమాజంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనను ప్రతి ఒక్కరూ తమ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy ) పిలుపునిచ్చారు. “బాల్యం ప్రతి చిన్నారి జన్మహక్కు... చదువుకోవడం, ఆడుకోవడం, ఆనందంగా ఎదగడం, తమ కలలను సాకారం చేసుకునే అవకాశాలు పొందడం ప్రతి పిల్లవాడి సహజ హక్కు.. ఆ హక్కులను హరించే బాల కార్మిక వ్యవస్థకు సమాజంలో చోటు లేకుండా చేయడం మనందరి బాధ్యత” అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, భద్రత, ఆరోగ్యకరమైన వాతావరణం, సమాన అవకాశాలు అందేలా ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. అదే సమయంలో కుటుంబాలు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, సమాజంలోని ప్రతి పౌరుడు ఈ లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలన్నారు. బాల కార్మిక వ్యవస్థను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదన్న సీఎం రేవంత్ ఎక్కడైనా చిన్నారులు పనుల్లో నిమగ్నమైనా, కనిపిస్తే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ప్రతి పౌరుడి బాధ్యతన్నారు. ఒక చిన్నారిని బాల కార్మికత్వం నుంచి బయటకు తీసుకురావడం అంటే అతనికి లేదా ఆమెకు ఒక కొత్త భవిష్యత్తును అందించినట్టేనని రేవంత్ రెడ్డి తెలిపారు. “పిల్లల చేతుల్లో పనిముట్లు కాదు.. పుస్తకాలు ఉండాలి. వారి భుజాలపై భారం కాదు.. భవిష్యత్తుపై ఆశలు ఉండాలి. ప్రతి చిన్నారి నవ్వుతూ, నేర్చుకుంటూ, కలలు కంటూ ఎదిగే తెలంగాణను నిర్మించడం మనందరి బాధ్యత” అని సీఎం ఎక్స్ సందేశంలో పేర్కొన్నారు.






