23 April, 2026 | 9:28 AM

సిగాచి క్షతగాత్రులకు సీఎం పరామర్శ

01-07-2025 01:28 PM

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం పాశమైలారం(Pashamilaram) ప్రాంతంలోని సిగాచి పరిశ్రమ(Sigachi Industry)లో రియాక్టర్ పేలుడు(Reactor Explosion) జరిగిన ఘటన స్థలాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మంగళవారం స్వయంగా పరిశీలించారు. ప్రమాద ఘటనపై సీఎం అధికారులతో మాట్లాడి సహాయ చర్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం పరామర్శించారు. క్షతగాత్రుల పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకొని, మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రమాద స్థలంలో మంత్రులు, అధికారులతో రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించి, చనిపోయిన కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 10 లక్షలు, పాక్షికంగా గాయపడినవారికి రూ.5 లక్షలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. 

భవిష్యత్ లో ఇలాంటి ఘటనాలు జరగకుండా ఒక స్పష్టమైన విధానంతో ముందుకెళ్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇకపై ఇలాంటి ఘటనాలు జరగకుండా కంపెనీల్లో పీరియాడికల్ ఇన్స్పెక్షన్ చేయాలని అధికారులకు సూచించారు. బాధిత కుటుంబాలను అన్నివిధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మృతదేహాలను బాధిత కుటుంబాలకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఘటనకు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సీఎంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజ నరసింహ, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పటాన్ చెరువు ఎమ్మెల్య మహేందర్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి ఉన్నారు.