అధిక సాంద్రత పత్తి సాగుతో దిగుబడి అధికం
- జిల్లా వ్యవసాయాధికారి సురేఖ
హాజీపూర్, (విజయక్రాంతి) : అధిక సాంద్రత పత్తి సాగు పద్ధతిలో దిగుబడి అధికమవుతుందని జిల్లా వ్యవసాయాధికారి (DAO) ఎల్తూరి సురేఖ తెలిపారు. గురు వారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట రైతు వేదికలో జాతీయ ఆహార భద్రత, పోషకాహార మిషన్ పరిధిలోని పత్తి ఉత్పాదకత మిషన్ (కపాస్ కాంతి 2026) పథకం కింద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సాధారణ సాగుతో పోలిస్తే ఎకరానికి ఎక్కువ మొక్కలు నాటడం వల్ల భూమి వినియోగం సమర్థవంతంగా జరిగి, ప్రారంభ దశలో కలుపు నియంత్రణ మెరుగుపడటంతో పాటు అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుందన్నారు. ఈ పద్ధతి తేలికపాటి ఎర్ర నేలలు, దుబ్బ నేలలకు అనుకూలంగా ఉండి, పంట త్వరగా కోతకు వస్తుందన్నారు. దగ్గర వరుసల మధ్య దూరంతో పత్తి సాగు (క్లోజర్ స్పేసింగ్) ద్వారా మొక్కల సాంద్రత పెరిగి, సూర్యరశ్మి, పోషకాల వినియోగం మెరుగుపడుతుందని, దీంతో ప్రారంభ దశలోనే మంచి పెరుగుదలతో పాటు అధిక దిగుబడి సాధించే అవకాశాలు పెరుగుతాయన్నారు.
మూడు అంశాల ద్వారా క్లస్టర్ ప్రదర్శనలు...
హాజీపూర్ మండలంలో మూడు అంశాల ద్వారా క్లస్టర్ ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని డీఏఓ సురేఖ పేర్కొన్నారు. అధిక సాంద్రత పత్తి సాగు కింద 86 హెక్టర్లు, దగ్గర వరుసల మధ్య దూరంతో పత్తి సాగు (క్లోజర్ స్పేసింగ్) కింద 36 హెక్టర్లు, సమగ్ర పంట యాజమాన్యం (ICM) కింద 11 హెక్టర్లలో ఇలా మొత్తం 133 హెక్టార్ల లో క్లస్టర్ ప్రదర్శనలు చేపడుతున్నామన్నారు. ఈ పథకం కింద ప్రభుత్వ రాయితీపై అందజేసే పత్తి విత్తనాల ప్యాకెట్లను ఆత్మ ఛైర్మెన్ సింగతి మురళితో రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ADA మామిడి క్రిష్ణ, FPO డైరెక్టర్ పుస్కూరి శ్రీనివాస రావు, మంచిర్యాల కార్పొరేషన్ కార్పొరేటర్ కమల శ్రీనివాస్ గౌడ్, చిన్న గోపాల్ పూర్ సర్పంచ్ జుగునాక రాజేష్, PACS డైరెక్టర్ నగేష్, ఆత్మ (ATMA) డైరెక్టర్ మునిమడుగుల శ్రీనివాస్, కర్ర సునీత జగన్ రెడ్డి, మండల వ్యవసాయాధికారి (MAO) హాజీపూర్ క్రిష్ణ, AEOలు మధుప, మౌనిక, కొమురయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.






