మళ్లీ సీఎం కుర్చీ పంచాయతీ.. ఢిల్లీకి సిద్ధూ, డీకే.. పర్యటనపై ఉత్కంఠ
బెంగళూరు: కర్నాటక రాజకీయం మరొక్కసారి ఢిల్లీకి చేరింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Karnataka Chief Minister Siddaramaiah), డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను అగ్రనాయకత్వం న్యూఢిల్లీకి పిలిపించారు. పార్టీ అంతర్గత విభేదాల పరిష్కారమే ప్రధాన అజెండాగా వీళ్ల పర్యటన సాగుతోందని పార్టీ వర్గాలు తెలిపాయి. తాజా పరిస్థితులు, మంత్రివర్గ విస్తరణ అంశాలపై చర్చించే అవకాశముంది. రాహుల్ గాంధీ(Rahul Gandhi) కాసేపట్లో పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ కు చేరుకోనున్నారు. కర్నాటకలో నాయకత్వ మార్పు ఊహాగానాలతో నేతల పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయమైన 'ఇందిరా భవన్'లో, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ సమక్షంలో ఒక కీలక సమావేశం జరుగుతోంది.
కాంగ్రెస్ అధిష్టానంతో జరగనున్న కీలక చర్చలకు ముందు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 'కర్ణాటక భవన్'లో మంత్రులతో అల్పాహార సమావేశం నిర్వహించడంతో న్యూఢిల్లీలో రాజకీయ కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి. సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌లను సీనియర్ నాయకులు విడివిడిగా కలిసే అవకాశం ఉందని, ఈ భేటీల్లో కర్ణాటక నాయకత్వ అంశమే ప్రధాన చర్చనీయాంశంగా నిలిచే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు సూచిస్తున్నాయి. రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరగవచ్చనే ఊహాగానాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి.






