27 May, 2026 | 1:41 AM

ఏఐడీఎంకేకు మరో షాక్

27-05-2026 12:45 AM
  1. టీవీకేలోకి మరో ఎమ్మెల్యే ఇసక్కి సుబ్బయ్య
  2. అధికారిక పార్టీ గూటికి ఇప్పటికే ముగ్గురు
  3. తాజా చేరికలతో నాలుగుకు చేరిన సంఖ్య
  4. నాలుగు చోట్లా త్వరలో ఉప ఎన్నికలు 

చెన్నై, మే ౨౬: తమిళనాడు రాజకీయాల్లో ఏఐడీఎంకేకు షాక్ మీద షాక్ తగులుతున్నది. పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే ఆ పార్టీని వీడి అధికార పార్టీ టీవీకేలో చేరారు. సోమవారం మధురాంతకం ఎమ్మెల్యే మరగాథం కుమారవేల్, పెరుందురై ఎమ్మెల్యే ఎస్.జయకుమార్, ధరాపురం ఎమ్మెల్యే పి.సత్యభామ సోమవారం తమ పదవులకు రాజీనామా చేసి మంత్రుల సమక్షంలో టీవీకేలో చేరిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం మరువకముందే మంగళవారం అంబసముద్రం నియోజకవర్గ ఎమ్మెల్యే ఇసక్కి సుబ్బయ్య కూడా అధికార పార్టీలో చేరారు.

ఈమేరకు అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. రాజీనామాను స్పీకర్ వెంటనే ఆమోదించారు. తర్వాత చెన్నైలోని టీవీకే ప్రధాన కార్యాలయానికి ఇసక్కి సుబ్బయ్య చేరుకున్నారు. ఆ పార్టీ జనరల్ సెక్రటరీ, మంత్రి ఎన్.ఆనంద్ సాదర స్వాగతం పలికారు. పార్టీ జెండా కప్పి పార్టీ సభ్యత్వం అందించారు. రెండోరోజుల్లో నలుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడటంతో ఏఐడీఎంకే శ్రేణులు ఆందోళనకు గురవుతున్నాయి.