16 April, 2026 | 3:15 AM

నేడు నల్లజెండాలతో నిరసన

16-04-2026 01:43 AM

తమిళనాడు ప్రజలకు సీఎం స్టాలిన్ పిలుపు 

డీలిమిటేషన్‌పై నిరసన

చెన్నై, ఏప్రిల్ 15: తమిళనాడు వ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా నేడు ప్రతీ ఇంటిపై నల్లజెండాలతో నిరసన చేపట్టాలని సీఎం ఎంకే స్టాలిన్ ప్రజలకు పిలుపునిచ్చారు. పునర్విభజనతో దక్షిణాదికి ద్రోహం జరుగుతుందన్నారు.

ఈ అంశంలో తమిళనాడు గళాన్ని పట్టించుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని స్టాలిన్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం ఎక్స్ వేదికగా మరోమారు సీఎం స్టాలిన్ తన ఆగ్రహావేశాలను వెళ్లగక్కారు. దేశాభివృద్ధికి కృషి చేసిన నేరానికి కేంద్రం దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తుందా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏకమవ్వాలని పిలుపునిచ్చారు.

పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే డీలిమిటేషన్ సవరణ బిల్లుపై దేశ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. అశాస్త్రీయ పునర్విభజనను తాము వ్యతిరేకిస్తూనే ఉన్నప్పటికీ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని తెరపైకి తీసుకురావడం కుట్రపూరిత చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లు పేరుతో పార్లమెంట్‌లో తమిళనాడుకు ప్రాతినిధ్యం తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.