2 September, 2026 | 1:43 AM

అనుమతుల్లేని కట్టడాలపై సీఎంసీ సుడిగాలి పర్యటన

02-09-2026 | 12:00am
  1. ఒక్కరోజే 26 నిర్మాణాలు కూల్చివేత..
  2.   10 పనులకు నోటీసులు

శేరిలింగంపల్లి,సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) పరిధిలో అనధికార నిర్మాణాలపై మంగళవారం ఉదయం నుంచే ఎన్ఫోర్స్మెంట్ బృందాలు క్షేత్రస్థాయిలో దిగాయి. తనిఖీల్లో మొత్తం 36 అనధికార కట్టడాలు బయటపడగా, వాటిలో 26 నిర్మాణాలను అక్కడికక్కడే కూల్చివేశారు. మరో 10 నిర్మాణాలపై నోటీసులు జారీ చేశారు. ఒక అనధికార నిర్మాణాన్ని సీజ్ చేశారు.

భవన నిబంధనలు ఉల్లంఘిస్తూ పెరిగిపోతున్న అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తప్పవని సీఎంసీ స్పష్టం చేసింది. గుర్తించిన నిర్మాణాలపై నిర్దేశిత విధానం, వర్తించే నిబంధనల ప్రకారమే తదుపరి చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు. నోటీసు అందిన 10 కట్టడాలపై విచారణ పూర్తయిన వెంటనే తదుపరి ఎన్ఫోర్స్మెంట్ చర్యలు తీసుకుంటామని సీఎంసీ పేర్కొంది.

జోన్ల వారీగా చూస్తే కుత్బుల్లాపూర్ జోన్లోనే అత్యధికంగా 11 నిర్మాణాలు కూల్చివేతకు గురయ్యాయి. శేరిలింగంపల్లి జోన్లో 8, కూకట్పల్లి జోన్లో 7 కట్టడాలను బృందాలు కూల్చివేశాయి. మూడు జోన్లలో కలిపి 26 కూల్చివేతలు జరిగాయి.అనధికార నిర్మాణాల గుర్తింపు, తనిఖీలు, పర్యవేక్షణ ఆగకూడదని సీఎంసీ కమిషనర్ శ్రీజన టౌన్ ప్లానింగ్, ఎన్ఫోర్స్మెంట్ బృందాలను ఆదేశించారు. నిబంధనలు పాటించని నిర్మాణాలపై చర్యలు కొనసాగుతాయని కార్పొరేషన్ స్పష్టం చేసింది.