1 September, 2026 | 11:57 PM

'అంబేద్కర్ అభయహస్తం' లబ్ధిదారులు ఎందరు?

01-09-2026 | 11:13pm

- హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం 

- అక్టోబర్‌లో  మహాదీక్ష

- ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ మాదిగ

సిద్దిపేట క్రైం,(విజయక్రాంతి): దళిత బంధు పథకానికి(Dalit Bandhu scheme) బదులుగా 'అంబేద్కర్ అభయహస్తం' పథకం(Ambedkar Abhayahastam Scheme) కింద దళితులకు రూ.12లక్షలు అందిస్తామని చెప్పి, ఇప్పటివరకు కనీసం 12 మందికైనా ఆర్థిక సహాయం అందించారా? అని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ(MRPS State President Srinivas Madiga) రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హామీలను అమలు చేయకుండా దళితులను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మంగళవారం సిద్దిపేటలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ముఖ్య సమావేశంలో వంగపల్లి శ్రీనివాస్ మాదిగ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తీవ్రంగా విఫలమైందని విమర్శించారు.

అంబేద్కర్ అభయహస్తం కింద అర్హులైన దళితులకు రూ.12 లక్షలు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌పై వచ్చే నెలలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మహాదీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తామని, గత ప్రభుత్వ హయాంలో గుంజుకున్న భూములను సైతం తిరిగి ఇప్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. మాదిగ, మాల, ఇతర ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయకపోగా, ఉన్న ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కూడా దళితులకు రుణ సౌకర్యం అందడం లేదని విమర్శించారు.

ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీలకు రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఇప్పటివరకు ఎంతమంది దళితులను కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దారో  ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ రిజర్వేషన్ల పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటో ప్రజలకు వివరించాలని కోరారు. అంబేద్కర్ విదేశీ విద్యా పథకం కింద ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయని, వాటిలో ఎన్ని పరిష్కరించారని ప్రశ్నించారు. రాజీవ్ యువ వికాస పథకం ఎందుకు మూలన పడేసిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పథకం అమలుపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం నాయకులు కట్కూరి పరశరాములు, ఎర్ర ఎల్లం, నముండ్ల శ్రీకాంత్ రాజేందర్, గాజుల ముత్య, కర్రె మాణిక్యం, పోతురాజు శంకర్, బెజ్జంకి తిరుపతి, సంఘం నాయకులు పాల్గొన్నారు.