4 July, 2026 | 3:15 AM

భద్రత, నాణ్యమైన విద్యుత్ సరఫరాపై సీఎండీ ప్రత్యేక సమీక్ష

04-07-2026 02:43 AM

సిరిసిల్ల, జూలై 3,(విజయక్రాంతి): టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో విస్తృతంగా పర్యటించి విద్యుత్ అభివృద్ధి పనులను పరిశీలించారు. వట్టెంల సబ్స్టేషన్లో అదనపు 5 ఎంవిఏ పీటీఆర్, మర్రిపల్లి సబ్స్టేషన్లో నూతన బంచ్డ్ బ్రేకర్ ను ప్రారంభించారు. జిల్లాకు 13 కొత్త సబ్స్టేషన్లు మంజూరయ్యాయని, వాటిలో రెండు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు.

19 బంచ్డ్ బ్రేకర్లలో 15 ఇప్పటికే పూర్తయ్యాయని, రైతులకు యూనిఫాం సర్వీస్ లైన్ ఛార్జీలతో కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు.విద్యుత్ లైన్ల బలోపేతం, మిడిల్ పోల్స్ ఏర్పాటు, దెబ్బతిన్న స్తంభాల మార్పిడి, డీటీఆర్ల ఏర్పాటు, 33 కేవీ ఇంటర్లింక్ లైన్ల పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.

వినియోగదారులు విద్యుత్ సమస్యల కోసం 1912 కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.వేములవాడ డివిజన్ కార్యాలయాన్ని సందర్శించిన సీఎండీ, సర్కిల్ పరిధిలోని అసిస్టెంట్ ఇంజనీర్లు, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లు, డివిజనల్ ఇంజనీర్లు, అకౌంట్స్ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించి, వినియోగదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, విద్యుత్ నష్టాలు తగ్గించి నాణ్యమైన సరఫరా అందించాలని ఆదేశించారు.

అలాగే సిబ్బంది విధుల్లో ’వన్ మినిట్ సేఫ్టీ’ సూత్రాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు.ఈ పర్యటనలో సూపరింటెండింగ్ ఇంజనీర్ టి. వేణుమాధవ్, డీఈ వెంకట రమణ (వేములవాడ), డీఈ ఎన్. అంజయ్య (సిరిసిల్ల), డీఈ చంద్రమౌళి, ఏడీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.