సారథి లేని సైన్యం..
- జిల్లా కాంగ్రెస్ లో జంబో లొల్లి అసంతృప్తి జ్వాలలు
- 113 మందితో జంబో కమిటీ నియామకం
- పాత అధ్యక్షుడికే మళ్లీ పగ్గాలు!
- డీసీసీ పీఠం దక్కక కుంగుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నేతలు
- చిగురింత పారిజాత, భీమ్ భరత్, భాస్కర్ రెడ్డి, రాజిరెడ్డి మధ్య పోరు పీక్స్
రంగారెడ్డి, జులై 3 (విజయక్రాంతి): ఎట్టకేలకు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి కార్యవర్గం విడుదలైంది. జిల్లాలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా భారీ కసరత్తు అనంతరం 113 మందితో కూడిన ‘జంబో’ కమిటీని ప్రకటిస్తూ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి లు ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే, ఈ కమిటీ నియామకం పార్టీలో ఉత్సాహాన్ని నింపడం పక్కన పెడితే.. కొత్త వివాదాలకు, తీవ్ర అసంతృప్తులకు తెరలేపింది.రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కొత్త ప్రెసిడెంట్లతో కూడిన సరికొత్త బాడీలను నియమించిన అధిష్టానం.. రంగారెడ్డి జిల్లాకు వచ్చేసరికి మాత్రం పాత జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డినే కొనసాగిస్తూ జంబో కమిటీని సర్దేయడం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
‘ఓట్లకేమో బహుజన జపం.. పదవులకేమో ఒకే వర్గమా?’
సామాజిక న్యాయం పాటించడంలో పార్టీ అధిష్టానం పూర్తిగా విఫలమైందనే విమర్శలు జిల్లా కాంగ్రెస్ కిందిస్థాయి క్యాడర్ నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి. ‘పార్టీ పటిష్టత కోసం ఏళ్ల తరబడి కిందిస్థాయిలో కష్టపడుతున్న మాకు గుర్తింపు ఎక్కడ? ఎన్నికల వేళ ఓట్ల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ జపం చేసే నాయకత్వం.. కీలకమైన డీసీసీ పదవుల పంపకాల్లో మాత్రం తాత్సారం చేస్తోంది.
గతంలోనూ ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేశారు, ఇప్పుడు అదే పునరావృతమైందని జిల్లా కాంగ్రెస్ అసంతృప్త నేతలు ఇప్పటికైనా పార్టీ అధిష్టానం పునరాలోచించి, డీసీసీ ఎంపికలో పారదర్శకత పాటించాలని, జంబో కమిటీకి పూర్తిస్థాయి న్యాయం జరిగేలా కొత్త సారథిని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.
డీసీసీ పీఠంపై సస్పెన్స్..
రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి (డీసీసీ ) నియామకంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఆశావహులైన చిగురింత పారిజాత, భీమ్ భరత్, సీనియర్ నేతలు దేపా భాస్కర్ రెడ్డి, రాజిరెడ్డి మధ్య పోటీ మరింత హీటెక్కింది. తమకే అవకాశం ఇవ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్లకు పలుదఫాలుగా వినతిపత్రాలు సమర్పించారు.
డీసీసీ పీఠం విషయంలో అభిప్రాయ సేకరణ పేరుతో గతంలో హడావుడిగా సమావేశాలు నిర్వహించిన కాంగ్రెస్ అధిష్టానం, చివరి నిమిషంలో ఇద్దరు ప్రధాన ఆశావహుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పేరును ప్రకటించకుండా పెండింగ్లో పెట్టింది. అధిష్టానం ఎటూ తేల్చుకోలేక పాత కమిటీ సారథ్యానికే జంబో హంగులు అద్దడంతో ఆశావహుల ఆశలు గల్లంతై తీవ్ర నిరాశలో మునిగిపోయారు.
అటు అమాత్యుడు లేడు.. ఇటు అధిష్టానం నాన్చివేత!
రంగారెడ్డి జిల్లాకు ప్రత్యేకంగా ఒక మంత్రి (క్యాబినెట్ ప్రాతినిధ్యం) లేకపోవడం ఒక మైనస్ అయితే, పార్టీ వ్యవహారాల్లో అధిష్టానం అవలంబిస్తున్న నాన్చివేత ధోరణి క్యాడర్లో గందరగోళాన్ని మరింత పెంచుతోంది. ఒక వైపు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్నాయి, మరోవైపు అత్యంత ప్రతిష్టాత్మకమైన జీహెచ్‌ఎంసీ ఎన్నికలు కూడా జరగనున్నాయి.
ఇలాంటి కీలక సమయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిని నియమించకుండా కాలయాపన చేయడం ఎంతవరకు కరెక్ట్ అని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. అసలు కొత్త డీసీసీ పోస్టును భర్తీ చేస్తారా? లేక మళ్లీ పాత అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డినే పూర్తి కాలం కొనసాగిస్తారా? అన్నది ఎవరికీ అంతుచిక్కని ప్రశ్నగా మారింది.






