4 July, 2026 | 2:18 AM

జూపల్లికి పనీపాట లేదు

04-07-2026 01:46 AM
  1. అందుకే ప్రెస్ క్లబ్‌కు వస్తున్నారు
  2. ఆయనలా గాలికి తిరిగే వాళ్లం కాదు
  3. బీఆర్‌ఎస్ ప్రధానకార్యదర్శి ఆర్‌ఎస్పీ

హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): జూపల్లి కృష్ణారావుకు పనీపాలలేదని, అందుకే సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు వస్తున్నారు. ఆయన తెలంగాణ భవన్‌కు వస్తారేమో..? అని ఇక్కడకు వస్తే, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వచ్చి ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నారు అని బీఆర్‌ఎస్ ప్రధానకార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఎద్దేవా చేశారు. జూపల్లి కృష్ణారావులా ‘మేం గాలికి తిరిగే వాళ్లం’ కాదన్నారు.

‘మేం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు’ వస్తామంటే మంత్రులు గన్‌పార్క్ వద్దకు వెళ్లారని, గన్‌పార్క్ వద్దకు ‘మా నాయకులు హరీశ్‌రావు, కేటీఆర్ రాకుండా అరెస్ట్ చేశారు’అని చెప్పారు. ఎవరి చెవిలోనైనా పూలు పెట్టాలి కానీ ప్రవీణ్‌కుమార్ చెవిలో కాదన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ఆర్‌ఎస్పీ మాట్లాడారు. ‘ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్షణ్‌కు నా గురించి బాగా తెలుసు.

నేను కరీంనగర్ జిల్లా ఎస్పీగా పని చేసినప్పుడు వారు ఏం చేశారో నాకు తెలుసు’ అని అన్నారు. పారదర్శకంగానే గురుకుల టెండర్‌లో అతిపెద్ద కుంభకోణం జరిగిందని ఆరోపించారు. జీవో 17 రద్దు చేసే వరకు 2 వేల కోట్ల కుంభకోణంపై నిరంతరం పోరాడుతూనే ఉంటామని హెచ్చరించారు.

జూపల్లి కృష్ణారావుకు పనీపాట లేకుండా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వెళ్తున్నారన్నారు.  సచివాలయంలో ఫైల్స్ పెండింగ్ ఉంటే చూసుకోవాలని, లేకపోతే ఇంట్లో పండుకోవాలని జూపల్లి కృష్ణారావుకు హితవు పలికారు. తనపై విచారణ చేసుకోవాలని మంత్రులకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నానని, అప్పుడు తాను తయారు చేసిన డాక్టర్లు, ఇంజినీర్లు,సైంటిస్ట్‌లు కనిపిస్తారని తెలిపారు.