18 May, 2026 | 4:02 AM

సీఎన్జీ ధర రూపాయి పెంపు

18-05-2026 12:42 AM
  1. దేశరాజధానిలో కిలో 80.97, హైదరాబాద్‌లో 97కు చేరిన ధర
  2. 48 గంటల్లో రెండుసార్లు పెంచిన కేంద్ర ప్రభుత్వం
  3. భారాన్ని ప్రభుత్వం, ఆయిల్ సంస్థలే మోస్తున్నాయి: కేంద్రమంత్రి రిజిజు

న్యూ ఢిల్లీ, మే 17: సీఎన్జీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చింది. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) కిలోకు రూ. 1 పెంచింది. ఈ పెంచిన ధరలు ఆదివారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. 48 గంటల్లోనే సీఎన్జీ ధరలు పెంచడం ఇది రెండోసారి. మే 15న సీఎన్జీ ధరలతో పాటు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను కూడా ప్రభుత్వం పెంచింది. గడిచిన రెండురోజుల్లో సీఎన్జీపై రూ. 3 పెరిగింది.

దీంతో సీఎన్జీ ధర హైదరాబాద్‌లో రూ.97కు చేరింది. ఢిల్లీలో రూ. 80.09గా ఉంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ నుంచి నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు, గ్యాస్‌కు సరఫరాలకు ఇబ్బందులు తప్పడం లేదు. పశ్చిమా సియా ఉద్రిక్తతలు ఇదేవిధంగా కొనసాగితే ముడిచమురు ధరలు దీర్ఘకాలం పాటు అధికంగా కొనసాగే అవకాశం ఉంది. దీంతో మరోమారు పెట్రోల్, డీజిల్‌తోపాటు సీఎన్జీ ధరలు కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా ధరల పెంపుపై కేంద్ర పార్లమెంటరీ 

వ్యవహారాల శాఖమంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. పశ్చిమాసియా సంక్షోభంతో ప్రపంచ వ్యాప్తంగా పలుదేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు 20 శాతం నుంచి 100 శాతం వరకు పెరిగాయని, భారత్‌లో మాత్రం పెట్రోల్‌పై కేవలం 3.2 శాతం, డీజిల్‌పై 3.4 శాతం మాత్రమే ధరలను కొద్దిగానే పెంచామని తెలిపారు. మిగతా భారాన్ని ప్రభుత్వం, ఆయిల్ సంస్థలు మోస్తున్నాయన్నారు.