10-09-2024 10:04:56 PM
నారాయణపేట.(విజయ క్రాంతి) : జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాలలో నిరుపేదలకు ఆరోగ్య వాహిని ప్రాజెక్టు దవాఖాన ద్వారా అందిస్తున్న మొబైల్ వైద్య సేవలను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అభినందించారు. నారాయణపేట మండలం జాజాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఆరోగ్య వాహిని మొబైల్ వాహనం ద్వారా గ్రామస్తులకు అందిస్తున్న వైద్య సేవలను మంగళవారం కలెక్టర్ పర్యవేక్షించారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి అక్కడి ప్రజలకు ఆరోగ్య పరీక్షలు మొబైల్ వ్యాన్ ద్వారా నిర్వహించడం గొప్ప విషయమని ఆమె నిర్వాహకులు చల్లా సురేష్ ను అభినందించారు.
ఆరోగ్య వాహిని ద్వారా ఇంతవరకు ఎంతమందికి వైద్య పరీక్షలు చేశారని అడిగి తెలుసుకున్నారు. ఇక ముందు కూడా ఆరోగ్య వాహిని సేవలు కొనసాగించాలని, అందుకు తన వంతు సహకారాన్ని అందిస్తానని కలెక్టర్ నిర్వాహకులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య వాహిని జిల్లా మేనేజర్ నర్సిములు, జాజాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ కోట్ల సుగంధమ్మ మోహన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.