10-09-2024 10:12:22 PM
నారాయణపేట.(విజయ క్రాంతి) : నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలను మంగళవారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల స్టడీ అవర్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఎఫ్ ఏ -2 పరీక్ష కు ఎలా సిద్ధం అయ్యారని కలెక్టర్ అడిగారు. పాఠశాలలో కనిసం పది మంది విద్యార్థులైన 10 జిపిఏ సాధించాలని ఆమె సూచించారు. ఆ పాఠశాలలో కొనసాగుతున్న ఆర్.బి.ఎస్.కే. హెల్త్ క్యాంప్ ను చూసిన కలెక్టర్ ఎంతమంది విద్యార్థులకు వైద్య పరీక్షలు చేశారని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పాఠశాలలోని పలు తరగతి గదులను ఆమె పరిశీలించి విద్యార్థులు ఎలా చదువుతున్నారు? రోజూ ఉదయం ఎన్ని గంటలకి నిద్ర లేస్తారు? ఏం వ్యాయమం చేస్తున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల అద్దె భవనంలో కొనసాగుతుండటం తో రెండు భవనాలలో విద్యార్థులు చదువుకుంటున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ కలెక్టర్ కు తెలిపారు. పాఠశాల వంట గది, భోజనశాల కు వెళ్లి కూరగాయలు, మధ్యాహ్న భోజన నాణ్యతను కలెక్టర్ పరిశీలించారు. భోజన నాణ్యతను రోజు ఎవరు పరిశీలిస్తారని కలెక్టర్ అడిగారు. మంగళవారం నాటి మోను లో గుడ్డు ఉందని, కానీ విద్యార్థులకు ఎందుకు ఇవ్వడంలేదని కలెక్టర్ వంట నిర్వాహకులను నిలదీశారు.
దీనిపై పాఠశాల ప్రిన్సిపాల్ వివరణ ఇస్తూ పరిస్థితులను బట్టి ఒకటి రెండుసార్లు గుడ్డు బదులు వేరే ఇస్తామని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ అలా ఎలా నిర్ణయం తీసుకుంటారో తనకు లిఖిత పూర్వకంగా జవాబు ఇవ్వాలని ప్రిన్సిపల్ ను ఆదేశించారు. పాఠశాలలో వంటశాల, భోజన కమిటీ విద్యార్థులతో మోను గురించి అడిగి తెలుసుకున్నారు. పాఠశాల వద్ద ఉన్న కొందరు యువకులు పాఠశాల సమస్యలను కలెక్టర్ కి వివరించారు.
పాఠశాల అద్దె భవనంలో కొనసాగుతుందని, విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుకున్నారని, కొన్ని నెలల క్రితం ఓ గుర్తు తెలియని వ్యక్తి పాఠశాల ఆవరణలోకి చొరబడి నానా హంగామా చేశాడని కలెక్టర్ కు తెలపడటంతో స్పందించిన ఆమె వాచ్ మెన్ ను అందుబాటులో ఉంచాలని, పాఠశాలకు మిషన్ భగీరథ తాగునీటి సరఫరా ను పెంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ ఆ పాఠశాలకు చెందిన మరో భవనానికి వెళ్లి అక్కడి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు ఏమైనా ఉంటే ఉపాధ్యాయులకు తెలపాలని సూచించారు. ఆ తర్వాత మద్దూరు సమీపంలో గురుకుల పాఠశాల నిర్మాణం కోసం గత కొన్నేళ్ల క్రితం కేటాయించిన గ్రామ కంఠం భూమిని కలెక్టర్ పరిశీలించారు.
ఆ స్థలంలో ఇంతవరకు గురుకుల పాఠశాలను ఎందుకు నిర్మించలేదనే విషయాన్ని సంబంధిత అధికారి అడిగి తెలుసుకుని తనకు సమాచారం ఇవ్వాలని తహాసిల్దార్ మహేష్ ను ఆదేశించారు. చివరగా కలెక్టర్ అదే మార్గంలో ఉన్న బీసీ బాలికల వసతి గృహాన్ని పరిశీలించి అక్కడ నెలకొన్న సమస్యలను సంబంధిత అధికారుల సమన్వయంతో వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తహసిల్దార్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ గరీమా నరుల, ఎంపీడీవో నరసింహారెడ్డి, ఎంపీ ఓ, ఆర్. ఐ. పంచాయతీ సెక్రెటరీ తదితరులు పాల్గొన్నారు