11-09-2024 05:00:00 AM
సంక్రాంతి, దసరా నవరాత్రుల వేళ బొమ్మల కొలువు ఏర్పాటు అనాదిగా వస్తోంది. అయితే మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టే బొమ్మల కొలువులో కచ్చితంగా నిర్మల్ కొయ్యబొమ్మలుంటాయి. అంతటి ప్రాధాన్యం ఉంది కాబట్టే ఈ కొయ్య బొమ్మలకు మనదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. మన జీవన విధానాన్ని తెలియజేసే నిర్మల్ బొమ్మలు ఎప్పుడూ కళాత్మకమే.
జీవకళ ఉట్టిపడే నిర్మల్ కొయ్యబొమ్మలు లేటెస్ట్ ట్రెండ్‌కు తగ్గట్టుగా కొత్త సొగబులతో అబ్బురపరుస్తున్నాయి. చేతి నైపుణ్యంతో బొమ్మలు తయారుచేసి, వాటికి సహజమైన రంగులద్ది.. కమనీయ చిత్రాలతో.. ఆలోచింపజేసే సందేశంతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి నిర్మల్ కొయ్యబొమ్మలు. 400 ఏళ్ల చరిత్ర ఉన్న నిర్మల్ కొయ్యబొమ్మలకు నేటికీ ఆదరణ తగ్గడం లేదంటే వాటి విశిష్టత ఏంటో ఇట్టే తెలిసిపోతోంది. నిమ్మల నాయుడు (17 శతాబ్దం) పాలనా కాలంలో ఆనాటి కులవృత్తులను ప్రోత్సహించడంతో నిర్మల్‌లో కొయ్యబొమ్మల తయారీ మొదలైంది.
అప్పటినుండే నిర్మల్ కొయ్యబొమ్మల ఖ్యాతి పెరిగింది. దాదాపు 50 కుటుంబాలు వీటినే జీవనాధారంగా చేసుకొని బతుకుతున్నాయి. అప్పట్లో ఈ బొమ్మలనే రాజులు, సుల్తాన్లకు బహుమతులుగా ఇచ్చేవారు. అడవుల్లో దొరికె పొనికి కర్రతో కొయ్యబొమ్మలు చెక్కి వాటిని చింతగుజ్జు సాయంతో అందమైన బొమ్మలు తయారుచేస్తారు. ప్రస్తుత మార్కెట్‌లో ఎన్ని కళారూపాలు వచ్చినా నిర్మల్ కొయ్యబొమ్మలకు సాటిరావు అని అంటారు నిర్మల్ కళాకారులు.
కొత్త సొగబులతో..
మార్కెట్‌లో ఎన్నో కళారూపాలు పరిచయమవుతున్నా.. వాటితో సమానంగా నిర్మల్ కొయ్యబొమ్మలు తమ ఉనికిని చాటుకుంటున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో లభించే పొనికి కర్రతో ఈ బొమ్మలు ప్రాణం పోసుకుంటాయి. చేతి పనిముట్లతో తయారీకి ఎక్కువ సమయం పడుతుండటం తో ఈతరం కళాకారులు కొత్త టెక్నాలజీ పద్ధతులు తెలుసుకుంటూ నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు. నిర్మల్ కొయ్య బొమ్మలకు మరింత ఆదరణ తెచ్చేవిధంగా ‘భారత హస్తకళల సమైక్య’ హైదరాబాద్, ఢిల్లీ, హర్యానా, తమిళనాడు ఫ్యాషన్ డిజైనర్ల చేత ఇక్కడి కళాకారులకు శిక్షణ ఇస్తున్నారు.
అలంకరణ, దేవతా రూపాలు, సందేశాత్మక చిత్రాలు, సంగీత వాయిద్యాలు, జంతువుల రూపాల్లో అందమైన బొమ్మలను తయారుచేస్తున్నారు. ఈ బొమ్మలు ఆన్‌లైన్‌లోనూ దొరుకుతూ కళను దేశవ్యాప్తం చేస్తున్నాయి. నిర్మల్ జిల్లాలో బొమ్మల వ్యాపారం ద్వారా ఒక్క ఏడాదిలోనే రూ.80 లక్షల ఆదాయం వస్తోంది. అయితే ఒక్కొ కుటుంబానికి నెలకు. రూ 16 వేల నుంచి 20 వేల ఆదాయం ఉంటుంది. ఇక నిర్మల్‌లో కొయ్యబొమ్మల పారిశ్రామిక సంఘం (నిర్మల్ టాయిస్ కో సొసైటీ) ఉంది. ఈ సంఘంలో మొత్తం 200 మంది సభ్యులుండగా 50 కుటుంబాలు మాత్రమే ఉపాధి పొందుతున్నాయి.
కొయ్య బొమ్మలకు ఆధారమిదే
పొనికిగా పిలిచే ఈ చెట్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో ఎక్కువగా కనిపిస్తోంది. కొయ్య బొమ్మల తయారీకి ఇదే ఆధారం కూడా. మృదువుగా, తేలికగా ఉండే పొనికి చెట్టు కలపను బొమ్మల తయారీలో, అలంకరణలో కర్రను ఎక్కువగా వాడుతారు. ప్రస్తుతం నిర్మల్ జిల్లా పరిధిలో 120 తెల్ల పొనికి చెట్లు మాత్రమే ఉన్నాయి. కళాకారులు దీన్నే వాడుతూ బొమ్మలను తయారు చేస్తున్నారు. ఇక ప్రభుత్వం కళాకారుల కోసం రూ. 50లక్షలతో కొత్త భవనం నిర్మించిం ది. ‘రాష్ట్ర హస్తకళల నైపుణ్య అభివృద్ధి సంస’్థ ఆధ్వర్యం లో కళాకారులకు కొత్త నైపుణ్యాలను నేర్పిస్తోంది. అయి తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కర్ర కొరత రాకుండా ప్రభుత్వం పొనికికి చేయూత ఇస్తోంది. ఈ నేపథ్యంలో 50 ఎకరాల్లో పొనికి మొక్కలు నాటింది. ప్రస్తుతం అటవీశాఖ ద్వారా పొనికి కర్రను క్యూబిక్‌మీటర్ రూ. 12000 చొప్పున కొంటూ కొయ్య బొమ్మలకు ప్రా ణం పోస్తున్నది.
గాజుల రామేశ్వర్, నిర్మల్
పొనికి కర్రను ప్రభుత్వం ఇవ్వాలి
నిర్మల్ కొయ్య బొమ్మలకు ప్రభుత్వం చేయూత అందించాలి. ఒక్కప్పుడు 200 కుటుంబాలు జీవనోపాధి పొందేవి. ప్రస్తుతం 50 కుటుంబాలకే పరిమితమైంది. అప్పటి కళాకారులు తప్ప కొత్తవారు ఎక్కువగా పని నేర్చుకొవడానికి ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ఇప్పించేలా ప్రోత్సహించాలి. పెన్షన్, హెల్త్ కార్డులు, అర్హులైనవారికి ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రభుత్వ కళాశాలల్లో వృత్తి కోర్సుగా అమలుచేయాలి. పొనికి కర్రను ప్రభుత్వం ఉచితంగా అందించాలి.
బీఆర్ శంకర్, నిర్మల్
పెన్షన్ ఇవ్వాలి
నా వయస్సు 70 ఏళ్లు. గత నలభై ఏళ్ల నుంచి బొమ్మలు తయారుచేస్తున్న. ఈ పని తప్ప మరే పని రాదు. 40 రకాల బొమ్మలను తయారుచేస్తా. నెలంత కష్టపడితే కేవలం రూ.17 వేలు మాత్రమే వస్తాయి. ఆ డబ్బులతోనే కుటుంబ అవసరాలను తీరుస్తున్నా. మా పిల్లలు ఆసక్తి చూపడం లేదు. పని మానేస్తే మా కుటుంబం గడవదు. కళలను బతికించడానికి ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాలి.
ఎన్ సత్యనారాయణ. కళాకారుడు
కొత్త కళతో..
మా తాత ముత్తాతల నుంచి ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాం. నేను 30 ఏళ ్లనుంచి బొమ్మలు చేస్తున్నా. గతంలో పక్షులు, జంతువులు, కూరగాయల, పండ్ల రూపాల్లో బొమ్మలను తయారు చేసేవాళ్లం. ప్రభుత్వం మాకు కళారుపాలు తయారు చేయడంలో కొత్త ఫ్యాషన్ డిజైన్లను నేర్పించింది. ఇతర హస్తకళల నిఫుణులతో కొత్త ట్రెండ్ బొమ్మల తయారీ శిక్షణ తీసుకున్నా. పిల్లలకు కూడా ఈ వృత్తి నేర్పించాలని ఉంది. కానీ ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం తయారీ మిషన్స్‌ను ఉచితంగా అందించాలి.
శేఖర్, కళాకారుడు