గుండాల మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
సేవల నాణ్యతపై సమగ్ర సమీక్ష
రెండు రోజుల్లో మార్పు లేకపోతే గుర్తింపు రద్దు –
ఏకలవ్య పాఠశాల ఏజెన్సీకి కలెక్టర్ హెచ్చరిక
గుండాల, (విజయక్రాంతి): గుండాల మండలంలో ప్రభుత్వ సేవల నాణ్యతను సమీక్షించేందుకు జిల్లా కలెక్టర్ అంకిత్ విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా విద్య, వైద్యం, పశుసంవర్ధక , పరిపాలన రంగాలకు సంబంధించిన పలు సంస్థలను ఆకస్మికంగా తనిఖీ చేసి సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు సమయానికి నాణ్యమైన సేవలు అందించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. గుండాల మండలం ముతాపురం గ్రామంలోని ఏకలవ్య పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్, తరగతి గదులు, ఆర్‌ఓ వాటర్ ప్లాంట్, మరుగుదొడ్లు, డైనింగ్ హాల్, కిచెన్ షెడ్, కంప్యూటర్ ల్యాబ్ తదితర సదుపాయాలను సమగ్రంగా పరిశీలించారు.
విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలు, భోజన నాణ్యత, పాలు సరఫరా, పరీక్షల నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు. పరిశీలనలో పాఠశాలలో పరిశుభ్రత లోపాలు, కిచెన్ షెడ్‌లో అస్వచ్ఛత, వంట ప్రాంగణంలో నిర్లక్ష్య నిర్వహణ, సిబ్బంది కొరత, కంప్యూటర్ ల్యాబ్‌లో దుమ్ము పేరుకుపోవడం, మెనూ ప్రకారం ఆహారం అందించకపోవడం వంటి అంశాలను గమనించి కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించిన కలెక్టర్, నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, “రెండు రోజుల్లో పాఠశాలలో ఉన్న అన్ని లోపాలను పూర్తిగా సరిచేయాలి. లేనిపక్షంలో ఏజెన్సీ గుర్తింపును రద్దు చేసి బ్లాక్‌లిస్ట్‌లో చేర్చే చర్యలు తీసుకుంటాం” అని కఠినంగా హెచ్చరించారు.
ఉదయం వండిన ఆహారాన్ని సాయంత్రం వరకు నిల్వ ఉంచకుండా, ప్రతి భోజనం తాజాగానే వండించి నాణ్యతతో అందించాలని స్పష్టం చేశారు. గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి ఆవరణలో ఉన్న 108 అంబులెన్స్ సిబ్బందితో మాట్లాడి వారు అందిస్తున్న సేవలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రధానంగా వచ్చే కేసులు, అత్యవసర పరిస్థితుల్లో రోగులను తరలిస్తున్న ఆసుపత్రులపై ఆరా తీశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని మందుల గది, ఇంజెక్షన్ రూమ్, స్టోర్ రూమ్, రక్త పరీక్షల గది తదితర విభాగాలను పరిశీలించారు. సిబ్బంది హాజరు రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్‌లను సమగ్రంగా తనిఖీ చేశారు. డెంగ్యూ పరీక్ష కిట్ల లభ్యతపై విచారించి, అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. మందుల పంపిణీ గదిలో సిబ్బంది అందుబాటులో లేకపోవడాన్ని గమనించిన కలెక్టర్, కారణాలను ప్రశ్నించారు. మందుల నిల్వ గదిని పరిశీలించి గడువు తేదీలను తనిఖీ చేశారు.
మందుల నిల్వ గదిలో ఎయిర్ కండిషనింగ్ సదుపాయం కల్పించడం తో పాటు ఫార్మసిస్ట్‌ను నియమించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “ప్రజలకు సమయానికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలి. అత్యవసర సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని వడదెబ్బకు అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలి” అని తెలిపారు. గుండాల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించిన కలెక్టర్, నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. నాణ్యతలో ఎటువంటి రాజీ లేకుండా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, ప్రజలకు త్వరితగతిన సేవలు అందేలా నిర్దిష్ట గడువులో కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్, తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో ఉన్న ఆర్‌ఓ ప్లాంట్ రెండు సంవత్సరాలుగా పనిచేయకపోవడాన్ని గమనించి, ఇప్పటికే మంజూరైన కొత్త ప్లాంట్ పనులను త్వరితగతిన పూర్తి చేసి వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. కిచెన్ షెడ్‌ను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. వంటకు మినరల్ వాటర్ వినియోగించాలని సూచించారు. పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడి పరీక్షలపై వివరాలు తెలుసుకుని, హిందీ పరీక్షకు శుభాకాంక్షలు తెలియజేశారు. డైనింగ్ హాల్ మంజూరుకు సంబంధించిన ప్రతిపాదనను పరిశీలించి త్వరలోనే అనుమతి ఇస్తామని హామీ ఇచ్చారు.
ఈ పర్యటనలో కలెక్టర్ వెంట తహసీల్దార్ ఖాసీమ్, మండల ప్రత్యేక అధికారి ఇంతియాజ్ ఖాన్, ఎంపీడీవో బాలరాజు, ఏకలవ్య పాఠశాల ప్రిన్సిపాల్ నితిన్ సింగ్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు డాక్టర్ సుధీర్, కస్తూరిబా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రావణ సంధ్య, బోధన సిబ్బంది, వైద్య సిబ్బంది మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.




