16 July, 2026 | 12:20 PM

ఇందిరమ్మ ఇళ్లపై కలెక్టర్ ఫోకస్

16-07-2026 12:19 PM

నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అధికారులకు ఆదేశాలు

ఉప్పునుంతల: ఉప్పునుంతల మండల పరిధిలోని రాయిచేడ్ గ్రామంలో తొలి విడత కింద మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ హెమంత్ కేశవ్ పాటిల్ గురువారం పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లను సందర్శించిన ఆయన పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి ప్రభుత్వం అందిస్తున్న సహాయం, నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలు, నిధుల వినియోగం తదితర అంశాలపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసి నిర్ణీత గడువులోగా లబ్ధిదారులకు అందజేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను సక్రమంగా వినియోగించుకుని నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించారు.

ఇళ్ల నిర్మాణంలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని కలెక్టర్ స్పష్టం చేశారు. పునాది నుంచి పైకప్పు వరకు ప్రతి దశలో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని, నిర్మాణ సామగ్రి నాణ్యంగా ఉండేలా చూడాలని సూచించారు. పనులు నిరంతరాయంగా కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, సాంకేతిక లేదా పరిపాలనా సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించి పనుల్లో జాప్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. లబ్ధిదారులు కూడా ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ చూపించి ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు అధికారులు తరచూ గ్రామాలను సందర్శిస్తూ పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో యాదగిరి, గ్రామ సర్పంచ్, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.