ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణపు పనులను త్వరగా పూర్తి చేయాలి
వాజేడు,(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణపు పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు. మంగళవారం వాజేడు మండలం టేకుల గూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణపు పనులను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లబ్ధిదారులతో ఇందిరమ్మ బిల్లులు పడుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మొత్తం ఎన్ని ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని, నిర్మాణంలో ఉన్న ఇండ్లను త్వరగా పనులు పూర్తి చేయాలన్నారు. మంజూరు అయినంత వరకు ఇండ్ల పనులు జరుగుతున్నాయ, ఏఏ దశలో ఉన్నాయని, పనులు జరిగినంత వరకు ఫోటో కాప్చర్ పూర్తి చేశారా అని అడిగి తెలుసుకున్నారు.
లబ్ధిదారులు కూడా ఇండ్లు పనులు వేగంగా పూర్తి చేయాలని, ప్రతి సోమవారం లబ్ధిదారుల అకౌంట్ లలో డబ్బులు జమ అవుతున్నాయని తెలిపారు. ఇల్లు రానివారు అధైర్య పడద్దని అర్హులైన ప్రతి ఒక్కరికి దశల వారిగా ఇండ్లను మంజూరు చేయబడునని అన్నారు.అనంతరం చంద్రు పట్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడారు. వంట గదిని మధ్యాహ్న భోజనంను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి స్కూళ్లో మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించాలని మధ్యాహ్న భోజన నిర్వాహకులకు సూచించారు.
కట్టెల పొయ్యి మీద వంట చేయవద్దని గ్యాస్ పొయ్యి నీ వినియోగించాలని మధ్యాహ్నం భోజనం కార్మికులకు సూచించారు. ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు వంట పాత్రలను తదితర సామాగ్రిని పంపిణీ చేసిన నేపథ్యంలో వాటిని సక్రమంగా వినియోగించుకొని పరిశుభ్రంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. అనంతరం పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ నిర్వహించి కలెక్టర్ మాట్లాడుతూ ఈ వర్షాకాలంలో వచ్చే మలేరియా డెంగ్యూ వ్యాధుల నియంత్రణలో ఏ ఒక్క వైద్య ఉద్యోగి నిర్లక్ష్యం వహించకూడదని లేనియెడల వారిపై శాఖాపరమైన కఠిన చర్యలు ఉంటాయని ఆదేశించారు.
జిల్లా స్థాయిలో తయారుచేసిన ప్రణాళికల షెడ్యూల్ను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అమలు చేయాలని, క్షేత్రస్థాయిలో సూపర్వైజర్స్ ప్రణాళికల ప్రకారము కార్యక్రమాల అమలు ఏ విధంగా జరుగుతుందని నిరంతరం పర్యవేక్షించాలని, ఆశా కార్యకర్తలు ప్రతిరోజు 20 ఇంటింటి సందర్శన కావించి జ్వరంతో బాధపడుతున్న వ్యక్తులను గుర్తించి వారికి మందు బిల్లులను ఇచ్చి, రెండు రోజులైనా కూడా జ్వరము తగ్గకుండాట్లయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలని తెలిపారు. అత్యవసర మందులతో పాటు ఇతర ఔషధాలను నిల్వ ఉంచుకోవాలని తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్ మందుల గదిని ఇన్ పేషెంట్ వార్డులను రూములను సందర్శించి రిజిస్టర్ లను రికార్డులను తనిఖీ చేశారు. పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక్క వైద్యులనీతో వైద్య సేవలు అందించడంలో ఒత్తిడిని తగ్గించడానికి, ఒక మెడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ను ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.






