1 September, 2026 | 9:36 PM

గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

01-09-2026 | 08:42pm

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు(Ganesh Navratri celebrations) నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్(District Collector Ankit) అన్నారు. మంగళవారం ఐ.డీ.ఓ.సీ కార్యాలయంలోని సమావేశపు హాలులో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల నిర్వహణ, నిమజ్జన ఏర్పాట్లపై రెవెన్యూ, పోలీస్, పంచాయతి రాజ్, అగ్నిమాపక,ఐ.టీ.సీ,సింగరేణి, ఎక్సైజ్, విద్యుత్,ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో  సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించడానికి పకడ్బందీ చర్యలు తీసుకావాలని అన్నారు. అన్ని గణేష్ మండపాలను తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ముందస్తుగా గణేష్ మండలి నిర్వాహకులు పూర్తి వివరాలు అందించాలని, ఇది ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు.  జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, మండల స్థాయిలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు సమావేశాలు నిర్వహించాలన్నారు. 

గణేష్ నవరాత్రి ఉత్సవాలు మొదటి రోజు నుండి నిమజ్జనం వరకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రశాంత వాతావరణంలో, అవాంచనీయ సంఘటనలు తావు లేకుండా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వినాయక నిమజ్జనానికి వినియోగించే వాహనాలను ముందస్తుగా రవాణాశాఖ అధికారి నుండి ధ్రువీకరణ తీసుకోవాలన్నారు. ప్రతి గణేష్ మండపం వద్ద అవసరమైన మేర బందోబస్తు ఏర్పాటు చేయాలని, గణేష్ నిమజ్జనం సజావుగా జరిగే విధంగా కట్టు దిట్టమైన భద్రత వ్యవస్థ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అనంతరం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ..గణేష్ నిమజ్జనం సందర్భంగా క్రేన్లు వినియోగించాలని, గణేష్ నిమజ్జనం జరిగే ప్రదేశాలలో గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల సహకారంతో కలిసికట్టుగా పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలన్నారు.