1 May, 2026 | 8:31 PM

శిశువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు

01-05-2026 07:08 PM

ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు మెరుగైన చికిత్స

క్రాడిల్ బేబీ విభాగం ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

గద్వాల,(విజయక్రాంతి): ఎవరూ లేని, వదిలివేయాలనుకున్న శిశువులను సంరక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చైల్డ్ సేఫ్టీ, ప్రొటెక్షన్, అడాప్షన్, ఆఫ్టర్ కేర్ వారోత్సవాల సందర్భంగా శుక్రవారం గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో క్రాడిల్ బేబీ (ప్రతి శిశువుకు రక్షిత ఆశ్రయం) విభాగాన్ని జిల్లా కలెక్టర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఏర్పాటుచేసిన బాల భరోసా ప్రత్యేక వైద్య శిబిరంలో వివిధ సమస్యలతో చికిత్స పొందేందుకు వచ్చిన చిన్నారులు, వారి తల్లిదండ్రులతో కలెక్టర్ మాట్లాడారు. వికలత్వం కలిగిన చిన్నారులకు అందిస్తున్న చికిత్స, ఇతర సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగ చిన్నారులకు నిబంధనలను అనుసరించి సదరం సర్టిఫికెట్లను జారీ చేయడం జరుగుతుందని, తద్వారా వికలాంగ పెన్షన్ పొందేందుకు అవకాశం ఉందన్నారు. వ్యాయామం, ఇతర పద్ధతుల ద్వారా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు నయం అయ్యేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు.

మహబూబ్నగర్ లోని డిఈఐసి ఆసుపత్రి నుంచి వారానికోసారి అక్కడి వైద్య సిబ్బంది గద్వాలకు వచ్చి ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు చికిత్స అందించేందుకు కృషి చేయాలన్నారు.  వైద్య సిబ్బంది సూచనల మేరకు తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఎక్సర్సైజులు చేయించాలని తద్వారా పిల్లలు సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సదుపాయాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూఓ సునంద, డిఎంహెచ్ఓ సంధ్య కిరణ్మయి, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు ఇందిర, డిసిపిఓ నరసింహా, వైద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు.