ప్రధాని మోదీ ఫోటో ముద్రించాలి
ముకరంపుర, ఆగస్టు 16(విజయ క్రాంతి): దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం 21 కోట్ల మంది రేషన్ కార్డుదారులకు, దాదాపు 90 కోట్ల మంది జనాభాకు ప్రతినెల ఒక్కొక్క వ్యక్తికి ఉచితంగా ఐదు కేజీల బియ్యం అందించడం జరుగుతుందని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు తెలిపారు.
నరేంద్ర మోడీ పేద ప్రజలు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో 'ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన' పథకం కింద రాష్ట్రంలోని 2 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్ బియ్యం అందిస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో పెట్టకపోవడం శోచనీయమని ఆదివారం ఒక పత్రిక ప్రకటన ద్వారా విచారం వ్యక్తం చేశారు. కేంద్ర నిధుల ద్వారా ఏ రాష్ట్రంలో ఏ కార్యక్రమం లేదా పథకం చేపట్టినా, సంబంధిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల యొక్క ఫోటోలను ముద్రించి కేంద్ర ప్రభుత్వం గౌరవిస్తుందని తెలిపారు.ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇట్టి విషయాన్ని గమనించి అట్టి నిర్ణయాన్ని పునః పరిశీలించి ప్రధాని మోదీ ఫోటోను ముద్రించాలని డిమాండ్ చేశారు.






