calender_icon.png 3 February, 2026 | 9:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి

03-02-2026 12:54:38 AM

మున్సిపల్ ఎన్నికల దిశా నిర్దేశం చేసిన కలెక్టర్

ఆదిలాబాద్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా, పారదర్శకంగా పనులు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియలో ముఖ్యంగా ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారుల పాత్ర చాలా కీలకమని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల సం దర్భంగా సోమవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు హనుమంత్ నాయక్ తో కలిసి పాల్గొన్న కలెక్టర్ అధికారులకు ఎన్నికల నిర్వహణపై దిశ నిర్దేశం చేశారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. ఎన్నికల నియమావళి, బ్యాలెట్ బాక్సుల వినియోగం, పోలింగ్ సమయాల్లో అనుసరించాల్సిన విధానాలపై అధికారులు పూర్తి అవగాహన కల్గి ఉండాలన్నారు. పోలింగ్ రోజున కేంద్రాల్లో ఎటువంటి పొరపాట్లు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిం చడమే లక్ష్యంగా విధులు నిర్వహించాలన్నారు. మున్సిపల్ ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన బాధ్యతలను, శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 100% వెబ్ కాస్టింగ్ ఉంటుందని, దీని ద్వారా పోలింగ్ సరళిని నిరంతరం పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. 

పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను తప్పనిసరిగా పోలింగ్ కేంద్రం వెలుపల ప్రదర్శించాలని, పోలింగ్ ఏజెంట్ల సంతకాలను సేకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ రాజు, నోడల్ అధికారులు మనోహర్, ఫణిందర్, మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్, మున్సిపల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.