14-02-2026 12:00:00 AM
విశ్వక్ సేన్ హీరోగా దర్శకుడు కేవీ అనుదీప్ రూపొందిన చిత్రం ‘ఫంకీ’. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ చిత్రంలో కయాదు లోహర్ కథానాయిక. ప్రేమికుల దినోత్సవం కానుకగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో నవ్వుల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం సక్సెస్ ప్రెస్‌మీట్ నిర్వహించింది.
ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. “సినిమా విడుదలకు ముందు ఒత్తిడి ఉండటం సహజం. కానీ నేను ఫంకీ విడుదలకు ముందు చాలా ప్రశాంతంగా ఉన్నా. కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకునేలా అనుదీప్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ చిత్రం నాకెంతో ఊరటనిచ్చింది. నా సినీ ప్రయాణంలో ఫంకీ లాంటి సినిమా చేయడం చాలా ఆనందాన్నిచ్చింది” అన్నారు. కథానాయిక కయాదు లోహర్ మాట్లాడుతూ.. “ప్రేక్షకులతో కలిసి సినిమా చూశాం. వారు ప్రతి జోక్‌ను ఎంజాయ్ చేస్తూ నవ్వడం ఎంతో సంతోషాన్నిచ్చింది” అని తెలిపారు.
దర్శకుడు అనుదీప్ మాట్లాడుతూ.. “సినిమాలో కామెడీతో పాటు ప్రేమకథ, భావోద్వేగాలు బాగా పండాయి” అని చెప్పారు. నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. “మా నమ్మకం నిజమై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇది కేవలం ప్రేక్షకులను నవ్వించాలనే ఉద్దేశంతో చేసిన సినిమా. ఆ విషయంలో మేము విజయం సాధించాం. ప్రేక్షకులంతా థియేటర్లకు వెళ్లి సినిమా చూడండి. మీ టికెట్ డబ్బులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. నవ్వుకోడానికి థియేటర్‌కి రండి.. అసలు నిరాశచెందరు” అన్నారు.