30 July, 2026 | 2:50 PM

రుతుపవనాలు, అల్పపీడనాలపై ఆశలు…

30-07-2026 02:14 PM

- వర్షాలతో అన్నదాతల హర్షం 

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొండూరి గాంధీ  

గంభీరావుపేట, జూలై 30 (విజయ క్రాంతి): గత రెండు మూడు రోజులుగా కురిసిన వర్షాలతో తెలంగాణ రైతులు కొంత ఉపశమనం పొందుతున్నారని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు కోండూరి గాంధీ రావు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా  గంభీరావుపేటలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రుతుపవనాలు, బంగాళాఖాత అల్పపీడనాల వల్ల మంచి వర్షాలు కురవాలని ఆశిస్తున్నామన్నారు.

అయితే వాతావరణ అంచనాలు ఆశించిన విధంగా లేవని,  ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశముందని తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులు నిపుణుల సూచనలు, ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరించాలని సూచించారు. వ్యవసాయ శాఖ రైతులకు అనుకూల పంటల విత్తనాలు అందుబాటులో ఉంచాలని కోరారు.వాతావరణ ఆధారిత పంటల భీమా పథకం ద్వారా వర్షాల లోటు, అధిక వర్షపాతం వంటి నష్టాల నుండి రైతులకు రక్షణ కల్పించవచ్చన్నారు. ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసే భూములన్నింటికీ భీమా చేయించాలని, పాక్స్ లు, బ్యాంకులు, అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు.

రాష్ట్రంలో ఇప్పటికే 30కి పైగా జిల్లాలు వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని, ఆగస్టు-సెప్టెంబర్‌లో కూడా విస్తృత వర్షాలు కురిసే అవకాశం తక్కువగా ఉందని చెప్పారు. భారీ, నిరంతర వర్షాలకు బదులుగా స్థానికంగా తక్కువకాల ఉరుములు మాత్రమే పడే అవకాశముందని, దీని వల్ల వర్షపాతం లోటు పూర్తిగా పూడ్చడం కష్టమని పేర్కొన్నారు.పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని గాంధీ రావు విజ్ఞప్తి చేశారు.