ట్రెండింగ్ కోర్సుల వేట!
- ఇంజినీరింగ్ అడ్మిషన్లపై ఏఐ ఎఫెక్ట్
- తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న ఎంపికలు
- ఐటీ రంగంలో అనిశ్చితి, తగ్గుతున్న ప్లేస్‌మెంట్స్
- సాఫ్ట్‌వేర్ కోర్సులపై అనాసక్తి
- ఏఐ భయంతో విద్యార్థుల వెనుకడుగు
- భద్రత ఉండే కోర్సుల వైపు మొగ్గు
హైదరాబాద్, జూన్ ౬ (విజయక్రాంతి): ఇంజినీరింగ్ అంటే కంప్యూటర్ సైన్స్ (సీఎస్‌ఈ), కంప్యూటర్ సైన్స్ అంటే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అనే భావన ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బలంగా ఉండేది. ఇంటర్ పూర్తయిన విద్యార్థుల్లో అత్యధిక మంది సాఫ్ట్‌వేర్ రంగాన్నే లక్ష్యంగా పెట్టుకొని ఇంజినీరింగ్ కోర్సులను ఎంచుకునేవారు.
తల్లిదండ్రులు కూడా భారీ ఫీజులు చెల్లించి పిల్లలను ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో చేర్పించేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవం, ఐటీ రంగంలో అనిశ్చితి, తగ్గుతున్న ప్లేస్‌మెంట్లు విద్యార్థుల కెరీర్ ఎంపికలను ప్రభావితం చేస్తున్నాయి.
గత రెండే ళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగం వేగంగా పెరగడంతో సాఫ్ట్‌వేర్ రంగంపై కొత్త చర్చ మొదలైంది. చాట్‌బాట్లు, కోడ్ జనరేషన్ టూల్స్, ఆటోమేషన్ సిస్టమ్స్ అభివృద్ధి చెందుతుండటంతో భవిష్యత్తులో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు తగ్గిపోతాయనే అభిప్రాయం బలపడుతోంది. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ అడ్మి షన్ల సమయంలో తల్లిదండ్రులు, విద్యార్థులు గతంలో మాదిరిగా సాఫ్ట్‌వేర్ కోర్సుల వైపు పరుగులు తీయడం మానేశారు. భవిష్యత్తులో డిమాండ్ ఉంటుందని భావిస్తున్న ప్రత్యేక కోర్సులపై ఆసక్తి కనబరుస్తున్నారు.
డిమాండ్ పెరుగుతున్న కోర్సులు ఇవీ..
ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, ఆటోమేషన్ వంటి కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. భవిష్యత్తులో ఉద్యోగ భద్రత ఉంటుందని భావిస్తూ తల్లిదండ్రులు పిల్లలను ఈ కోర్సుల వైపు మళ్లిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఏఐ ఆధారిత కెరీర్లపై విస్తృత ప్రచారం జరుగుతుండటంతో చాలా కుటుంబాలు ఈ రంగాలను మరింత ఆశాజనకంగా చూస్తున్నాయి. అయితే కేవలం కోర్సు పేరు చూసి కాకుండా, దానికి అవసరమైన నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
దీంతోపాటు ఏఐ వల్ల కొన్ని సంప్రదాయ ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉన్నా, అదే సమయంలో కొత్త రకాల ఉద్యోగాలు కూడా పుట్టుకొస్తాయని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. ఏఐ డెవలప్‌మెంట్, డేటా ఎనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏఐ మేనేజ్‌మెంట్, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ వంటి రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయి. భవిష్యత్తులో ఉద్యోగాలు కేవలం డిగ్రీ ఆధారంగా కాకుండా నైపుణ్యాలు, సమస్య పరిష్కార సామర్థ్యం, కొత్త టెక్నాలజీలను నేర్చుకునే సామర్థ్యం ఆధారంగా లభించే పరిస్థితి ఏర్పడుతోంది.
ముందున్న సవాళ్లు
తెలంగాణలో 1.05 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లో 1.4 లక్షల ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నప్పటికీ, ఈసారి అడ్మిషన్లలో విద్యార్థుల ఎంపికలో మార్పు కన్పిస్తోంది. 2030 నాటికి 22 శాతం ఉద్యోగాలు మార్పులకు లోను కానుండగా 170 మిలియన్ కొత్త ఉద్యోగాలు ఏర్పడి, 92 మిలియన్ ఉద్యోగాలు అంతరించిపోవచ్చని ప్రపంచ ఆర్థిక వేదిక అంచనా వేస్తోంది. మరోవైపు 2023 మధ్య ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు భారీస్థాయిలో ఉద్యోగాల కోతలు విధించాయి.
అయితే తెలుగు రాష్ట్రాల్లోని అనేక ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్లేస్‌మెంట్లు 30 నుంచి 60 శాతం మధ్యే నమోదవుతుండటంతో తల్లిదండ్రులు, విద్యార్థులు సాఫ్ట్‌వేర్ కోర్సులపై వెనుకడుగు వేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఏఐ కారణంగా తలెత్తుతున్న మార్పులకు అనుగుణంగా ఇంజినీరింగ్ కాలేజీలు కూడా తమ సిలబస్‌లను మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఏఐ, డేటా సైన్స్, ఆటోమేషన్ వంటి అంశాలను అన్ని విభాగాల్లో ప్రవేశపెట్టాలని విద్యా నిపుణులు సూచిస్తున్నారు.
పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దకపోతే భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలకు తగిన మానవ వనరులు అందించడం కష్టమవుతుందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగ భద్రత, ప్రత్యేక నైపుణ్యాలు, భవిష్యత్తు అవకాశాలను దృష్టిలో పెట్టుకొని కోర్సులను ఎంపిక చేసుకునే కొత్త ధోరణి కనిపిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా మారుతున్న ఈ కాలంలో మార్పులకు అనుగుణంగా నేర్చుకునే వారికే భవిష్యత్తు అవకాశాలు ఎక్కువగా ఉండనున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.
ప్లేస్‌మెంట్లపై ఆందోళన
ఒకప్పుడు ఇంజినీరింగ్ కాలేజీలు తమ ప్లేస్‌మెంట్ రికార్డులతో విద్యార్థులను ఆకర్షించేవి. కానీ ఇటీవల అనేక కాలేజీల్లో ప్లేస్‌మెంట్ శాతం తగ్గడం, పెద్ద ఐటీ కంపెనీలు క్యాంపస్ నియామకాలను పరిమితం చేయడం, ఉద్యోగాల కోసం విద్యార్థులు ఎక్కువకాలం వేచి చూడాల్సిన పరిస్థితి తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది. అడ్మిషన్ తీసుకునే ముందు కాలేజీల ప్లేస్‌మెంట్ వివరాలను పరిశీలించడం ఇప్పుడు సాధా రణంగా మారింది. గతంలో బ్రాండ్ పేరుతో సీటు తీసుకునే వారు ఇప్పుడు ఉద్యోగ అవకాశాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు.
వాస్తవానికి హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ దేశంలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ కేంద్రంగా గుర్తింపు పొందింది. ఒకప్పుడు వేలాది మంది విద్యార్థులతో కళకళలాడిన ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లలో ఇప్పుడు కొంత మందగమనం కనిపిస్తోంది. ఏఐ కారణంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు శిక్షణ కోర్సుల విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అయితే ట్రైనింగ్ నిపుణులు మాత్రం ఏఐ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను పూర్తిగా భర్తీ చేయదని, కొత్త నైపుణ్యాలను నేర్చుకున్న వారికి అవకాశాలు మరింత పెరుగుతాయని చెబుతున్నారు.






