5 September, 2026 | 8:27 AM

ఘట్‌కేసర్ బైపాస్‌లో ప్రయాణికులకు నరకం

05-09-2026 | 05:30am
  1. బస్ షెల్టర్ లేక ఇబ్బందులు 
  2. రోడ్డుమీద బస్సుల కోసం తప్పని నిరీక్షణ 
  3. ప్రతిరోజు వేలాది ప్రయాణికుల రాకపోకలు

ఘట్‌కేసర్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై(Hyderabad-Warangal National Highway) కీలక జంక్షన్గా ఉన్న ఘాట్కేసర్ బైపాస్(Ghatkesar Bypass) చౌరస్తాల్లో ప్రయాణికుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. ప్రతినిత్యం వేలాది మంది ప్రయాణికులు(Passengers), ఉద్యోగులు(Employees), విద్యార్థులు(Students) వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ బైపాస్ రోడ్డు పైకి చేరుకుంటారు. అయితే, ఇక్కడ కనీస బస్ షెల్టర్లు(bus shelters), సరైన బస్ స్టాపింగ్ పాయింట్లు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

కనీస వసతులు కరువు

ఎండైనా, వానైనా ప్రయాణికులు రోడ్డు పక్కనే నిలబడి బస్సుల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎండ తీవ్రతకు నీడ దొరకక, అకస్మాత్తుగా వర్షం వస్తే తడవకుండా ఉండటానికి సరైన ఆసరా లేక అల్లాడిపోతున్నారు. మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. చుట్టుపక్కల ఎలాంటి నీడ లేదా కూర్చునేందుకు సరైన సిమెంట్ బెంచీలు కూడా లేకపోవడంతో ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది.

రోడ్డుపైనే నిరీక్షణ

ప్రత్యేకమైన బస్ షెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికులు రోడ్డు మార్జ్పినే నిలబడాల్సి వస్తోంది. బస్సులు వచ్చినప్పుడు  రాత్రి వేళల్లో సరిపడా వీధి దీపాలు లేక ప్రయాణికుల భద్రత మరింత ప్రశ్నార్థకంగా మారుతోంది.

తాగునీరు, మరుగుదొడ్ల సమస్య

రోడ్డుపై గంటల తరబడి వేచి ఉండే ప్రయాణికులకు తాగడానికి సురక్షితమైన తాగునీరు కానీ, అత్యవసర సమయాల్లో ఉపయోగించుకోవడానికి ప్రజా మరుగుదొడ్లు కానీ అందుబాటులో లేవు. ముఖ్యంగా దూరప్రాంతాలకు వెళ్లే మహిళా ప్రయాణికులు ఈ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పాలకులు, అధికారుల అలసత్వం

ఘాట్కేసర్ వేగంగా విస్తరిస్తున్న పట్టణం. చుట్టుపక్కల అనేక ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలలు, కంపెనీలు ఉండటంతో బైపాస్ చౌరస్తా ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న కూడలిలో ఒక ఆధునిక బస్ షెల్టర్ నిర్మించడంలో అధికారులు, అధికార పార్టీ నాయకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

తక్షణమే స్పందించాలి

ప్రయాణికుల ప్రాణభద్రతను దృష్టిలో ఉంచుకుని, వాతావరణ పరిస్థితుల నుండి ఉపశమనం కలిగించేలా ఘాట్కేసర్ బైపాస్ చౌరస్తాల్లో తక్షణమే అన్ని వసతులతో కూడిన మోడల్ బస్ షెల్టర్లను నిర్మించాలని స్థానికులు, ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ,  జాతీయ రహదారుల సంస్థ అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరిన్ని వార్తలు