కలాల కూర్పులు
కలాలు అల్లిన పదునైన అక్షరాలు ---
పగిలిన మౌనాలను పలికిస్తాయి
నిద్రలో ఉన్న నిజాలను
నిగర్విగా నిలబెడతాయి.
****
కలాలు వాడిన పదునైన పదాలు ---
పొరలైన అబద్ధాలను తొలగిస్తాయి
మాయమాటల ముసుగులను
మెల్లగా చీల్చి చూపిస్తాయి
****
కలాలు తెలిపిన పదునైన భావాలు ---
మనసుల మర్మాలను తడిమేస్తాయి
నిర్లిప్తంగా నిలిచిన హృదయాల్లో
నిజం మంటలు రాజేస్తాయి
****
కలాలు వదిలిన పదునైన మాటలు ---
సమాజపు మలినాలను కడుగుతాయి
సత్యపు కాంతిని
సర్వదిక్కులా పరచుతాయి
****
కలాలు కూర్చిన పదునైన రాతలు ---
కాలపు చెక్కిళ్లపై చెక్కుతాయి
కాలుష్యపు గోడలపై
కవిత్వపు కిరణాలు చిమ్ముతాయి
****
కలాలు కదిలితే ---
కుర్చీలు కూడా కదులుతాయి
కలాలు పదునెక్కితే ---
కప్పుకున్న ముసుగులు జారిపోతాయి
****
కలం వ్రాతలు కళ్ళను కట్టిపడేస్తాయి
కలం చేతలు కనువిప్పు కలిగిస్తాయి
కలం మోతలు కర్ణాలకు కమ్మదనమిస్తాయి
కలం పోతలు కలనామృతం కురిపిస్తాయి
గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్




