29 June, 2026 | 12:30 PM

పెబ్బేరు వద్ద బస్సు ప్రమాదం

29-06-2026 11:19 AM
  1. 10 మందికి స్వల్ప గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం 
  2. పెబ్బేరు, వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రులకు క్షతగాత్రులను తరలింపు 
  3. సహాయక చర్యల్లో ఎమ్మెల్యే విజయుడు

వనపర్తి, (విజయక్రాంతి)/పెబ్బేరు/అలంపూర్:  వనపర్తి డిపోకి చెందిన ఆర్టీసీ బస్ మంత్రాలయం నుండి కర్నూల్ మీదుగా వనపర్తి కి వస్తున్న క్రమంలో పెబ్బేరు జాతీయ రహదారి( Pebbair National Highway) 44 పై అదుపుతప్పి బోల్తా  పడటంతో 11 మంది ప్రయాణికులు గాయపడగా అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. కాగా బస్సులో మొత్తం 61 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుండగా ఒక్కసారిగా ఈ ప్రమాదం జరిగే సరికి ప్రయాణికులు భయబ్రాంతులకు గురి అయ్యారు. విషమ పరిస్థితి ఉన్న ఒక్కరిని మెరుగైన వైద్యం కోసం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా స్వల్ప గాయలైన వారిని గద్వాల, వనపర్తి, పెబ్బేరు  ఆసుపత్రి లో వైద్యం అందిస్తున్నారు. 

సహాయక చర్యల్లో ఎమ్మెల్యే విజయుడు.

అటుగా వెళ్తున్న ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు(Alampur MLA Vijayudu) వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను స్థానికులు, పోలీసులు, సహాయక సిబ్బందితో కలిసి బయటకు తీసి అంబులెన్స్‌లు, పోలీసు వాహనాల్లో పెబ్బేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలా ఏర్పాట్లు చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించగా, ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.