19 August, 2026 | 9:16 PM

ఖరీఫ్ ధాన్యం సేకరణకు ముందే సమగ్ర నిల్వ ప్రణాళిక సిద్ధం చేయాలి

19-08-2026 08:29 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్‌ సంగ్వాన్‌

కామారెడ్డి,(విజయక్రాంతి): రాబోయే ఖరీఫ్ 2025-26 సీజన్‌లో సేకరించనున్న వరి ధాన్యానికి అవసరమైన నిల్వ సామర్థ్యాన్ని ముందుగానే సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. ధాన్యం నిల్వ ఏర్పాట్లపై బుధవారం కామారెడ్డి కలెక్టరేట్లో అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... గత మూడు సీజన్లకు సంబంధించి మిల్లర్ల నుంచి రావాల్సిన కస్టమ్ మిల్డ్ రైస్ బకాయిలతో పాటు ప్రస్తుతం జిల్లాలో అందుబాటులో ఉన్న ధాన్యం నిల్వ పరిస్థితిని సమీక్షించారు.

అక్టోబర్ 2026 చివరి వారం నుంచి కొత్త ధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున, అప్పటిలోగా అవసరమైన నిల్వ సామర్థ్యాన్ని సమకూర్చుకోవాలని సూచించారు. బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజన్ల పరిధిలో ధాన్యం నిల్వకు అనువైన ప్రభుత్వ, ఖాళీ భూములను గుర్తించి, క్యాప్ నిల్వ, సైలో బ్యాగ్ నిల్వ ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను వెంటనే అందించాలని ఆర్‌డీవోలను ఆదేశించారు. జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఇతర సంస్థల వద్ద ఉన్న ఖాళీ గోదాములను ధాన్యం నిల్వకు వినియోగించుకునేలా ముందస్తుగా సిద్ధం చేయాలని సూచించారు.

ప్రస్తుత సామర్థ్యానికి అదనంగా మరిన్ని నిల్వ కేంద్రాలను గుర్తించాలని తెలంగాణ రాష్ట్ర గోదాముల సంస్థ అధికారులను ఆదేశించారు. డిఫాల్ట్ రైస్ మిల్లుల ప్రాంగణాల్లో నిల్వ ఉన్న మొక్కజొన్న, జొన్నలను ఖాళీ చేయించేందుకు పెండింగ్‌లో ఉన్న విడుదల ఉత్తర్వులను వేగవంతం చేయాలని మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్‌ను శ్రీకాంత్ ను ఆదేశించారు. తద్వారా ఆ ప్రాంగణాలను కొత్త సీజన్ ధాన్యం నిల్వకు వినియోగించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.అదేవిధంగా, గత సీజన్లకు సంబంధించిన కస్టమ్ మిల్డ్ రైస్ బకాయిలు ఉన్న మిల్లర్లు మిల్లింగ్, ధాన్యం డెలివరీ ప్రక్రియను వేగవంతం చేసి, కొత్త ధాన్యం రాకకు ముందే మిల్లుల సామర్థ్యాన్ని ఖాళీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

జిల్లాలోని చక్కెర కర్మాగారాల యాజమాన్యాలు తమ ఖాళీ ప్రాంగణాలను ధాన్యం నిల్వకు అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. న్యాయపరమైన వివాదాల్లో ఉన్న నిల్వ ప్రాంగణాలకు సంబంధించి అవసరమైన న్యాయపరమైన అనుమతులను సత్వరమే పొందేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి శాఖ తమ ఆధీనంలో ఉన్న ఖాళీ గోదాములు, నిల్వ ప్రాంగణాలు, అందుబాటులో ఉన్న స్థలాల పూర్తి వివరాలను ఆలస్యం చేయకుండా అందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అన్ని శాఖల వివరాలను సమీకరించి సమగ్ర జిల్లా ధాన్యం నిల్వ ప్రణాళికను సిద్ధం చేయనున్నట్లు తెలిపారు.

కొత్త సీజన్ ధాన్యం జిల్లాకు చేరుకునే సమయానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో అవసరమైన నిల్వ సామర్థ్యాన్ని సిద్ధం చేయాలి అన్నారు. ప్రతి శాఖకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేసి, రైతుల నుంచి ధాన్యం సేకరణ సజావుగా జరిగేలా సమన్వయంతో పనిచేయాలి సూచించారు. ధాన్యం నిల్వకు సంబంధించిన చర్యలపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది” అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. పై అంశాలపై తీసుకున్న చర్యలకు సంబంధించిన సమగ్ర నివేదికను వారం రోజుల్లోగా సమర్పించాలని జిల్లా కలెక్టర్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు విక్టర్, ఎన్ వై గిరి, జిల్లా సివిల్ సప్లై అధికారి వెంకటేశ్వర్లు, సివిల్ సప్లై మేనేజర్ శ్రీకాంత్, ఆర్డీవోలు, తాసిల్దారులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.