1 June, 2026 | 2:19 AM

కాగితాలకే పరిమితమైన ‘111 జీవో’..!

01-06-2026 01:34 AM
  1. ధరలు ‘కోట్లు’.. అధికారుల ‘నోట్లు’.. 
  2. దొంతాన్‌పల్లిలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు

శంకర్ పల్లి, మే 31 (విజయక్రాంతి): జీవో 111 నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితమా? సామాన్యుడి గుడిసెకు లేని పర్మిషన్.. కోట్ల రూపాయల రియల్ వ్యాపారుల భారీ కట్టడాలకు ఉందా? రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం దొంతాన్పల్లిలో నిబంధనలు బేఖాతరు చేస్తూ వందల ఎకరాల్లో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి.

హైదరాబాద్ మహానగరానికి కూతవేటు దూరంలో ఉండటంతో ఇక్కడి భూముల ధరలు కోట్లకు చేరాయి. ఇదే అదనుగా భావించిన కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అధికారుల మౌనాన్ని ఆసరాగా చేసుకుని ‘111 జీవో’ నిబంధనలను నడిరోడ్డుపై నలిపేస్తున్నారు.

దొంతాన్‌పల్లిలో అక్రమ నిర్మాణాల జోరు..

హైదరాబాద్ మెయిన్ రోడ్డును ఆనుకుని ఉన్న దొంతాన్పల్లి గ్రామం ఇప్పుడు అక్రమ కట్టడాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. ఈ ప్రాంతం పూర్తిగా 111 జీవో పరిధిలోకి వస్తుంది. నిబంధనల ప్రకారం ఇక్కడ ఎలాంటి భారీ కట్టడాలకు, కమర్షియల్ వెంచర్లకు అనుమతి లేదు. కానీ, ఇవేమీ పట్టని కొందరు వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా శరవేగంగా భారీ రేకుల షెడ్లను నిర్మిస్తున్నారు.

కళ్లముందే ఇంత పెద్ద ఎత్తున అక్రమ కార్యకలాపాలు సాగుతున్నా.. స్థానిక పంచాయతీ అధికారులు, ఉన్నతాధికారులు కళ్లుండీ చూడనట్లు వ్యవహరించడం వెనుక పెద్ద ఎత్తున ‘మామూళ్ల’ పర్వం నడిచిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇంత భారీ నిర్మాణాలు జరుగుతుంటే అధికారుల కంటికి ఆనడం లేదా? అని స్థానికులు సూటిగా ప్రశ్నిస్తున్నారు.

నియమాలు కేవలం పేదలకేనా..?

సామాన్యుడు తలదాచుకోవడానికి చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా వంద నిబంధనలు చూపే అధికారులు, కోట్ల రూపాయల పెట్టుబడులతో పర్యావరణాన్ని దెబ్బతీసేలా రియల్ వ్యాపారులు చేస్తున్న అక్రమ నిర్మాణాలపై ఎందుకు మౌనంగా ఉంటున్నారు?‘ అంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టాలు కేవలం పేదలను ఇబ్బంది పెట్టడానికేనా, బడా బాబులకు మినహాయింపులు ఇస్తారా అని వారు మండిపడుతున్నారు.

చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్...

అధికారుల అండదండలతోనే ఈ అక్రమ సామ్రాజ్యం విస్తరిస్తోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, 111 జీవోకు విరుద్ధంగా దొంతాన్పల్లి పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలను, రేకుల షెడ్లను వెంటనే కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.