1 June, 2026 | 2:18 AM

ఆగని అక్రమ నిర్మాణం

01-06-2026 01:33 AM
  1. ఎఫ్‌టీఎల్‌లో దర్జాగా నిర్మాణం
  2. అనుమతులకు విరుద్ధంగా అదనపు అంతస్తులు
  3. సీజ్ చేసినా డోంట్ కేర్..
  4. కోర్ట్ స్టే ఆర్డర్.. అక్రమంగా సీజ్ తొలగింపు
  5. స్పందించని నిజాంపేట్ సర్కిల్ ఏసీపీ

పీట్ల ప్రవీణ్, కుత్బుల్లాపూర్, మే 31(విజయక్రాంతి): నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అనుమతులకు విరుద్ధంగా బహుళ అంతస్తులు నిర్మిస్తూ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు అక్రమ నిర్మాణదారులు. కొన్ని అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదులు చేసినా చర్యలు మాత్రం కాగితలకే పరిమితమయ్యాయని ఆరోపణలు ఉన్నాయి.

కొందరు అక్రమ నిర్మాణదారులు అయితే బరితెగిస్తూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఇష్టారీతిన చెలరేగిపోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సీజ్ చేసిన అక్రమ నిర్మాణాన్ని అక్రమంగా సీజ్ తొలగించి నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని బాచుపల్లిలో  ఓ నిర్మాణదారుడు గ్రామ పంచాయతీ అనుమతులు పొందాడు. అనుమతులకు విరుద్ధంగా అదనపు అంతస్థులు,సెల్లార్ త్రవ్వి, కమర్షియల్ భవనంగా నిర్మించాడు.

అంతే కాకుండా బాచుపల్లి పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్‌లో అక్రమ భవనాన్ని నిర్మిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. అయితే సర్కిల్ అధికారులకు పలు ఫిర్యాదులు అందడంతో అక్రమ భవనాన్ని సీజ్ చేశారు. సదరు అక్రమ నిర్మాణదారుడు కొన్ని రోజులు సైలెంట్‌గా ఉండి అక్రమంగా సీజ్ ను తొలగించి ప్రభుత్వానికి సవాల్ విసురుతూ యధావిధిగా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నాడు .తర్వాత మళ్ళీ ఫిర్యాదులు అందడంతో సర్కిల్ అధికారులు రెండవ సారి అక్రమ భవనాన్ని సీజ్ చేశారు.

కోర్ట్ నుండి స్టే ఆర్డర్... అక్రమంగా సీజ్ తొలగింపు..

అయితే సదరు అక్రమ నిర్మాణదారుడు కోర్ట్ నుండి స్టే ఆర్డర్ పొందాడు.నిబంధనలకు విరుద్ధంగా తిరిగి మళ్ళీ సీజ్ తొలగించి ధర్జాగా అక్రమ నిర్మాణం చేపడుతున్నాడు. స్టే ఆర్డర్ ఉంటే యధావిధిగా బిల్డింగ్ స్థితి ఉండాలి. కానీ బిల్డర్ స్టే ఆర్డర్ సాకుతో ప్రభుత్వ యంత్రాంగం వేసిన సీజ్ తొలగించే హక్కు ఏ మాత్రం లేదు. చట్టాన్ని లెక్కచేయకుండా టౌన్ ప్లానింగ్ యంత్రాంగం వేసిన సీజ్ ను తొలగించి పనులు చేపట్టడం నేరం.

కోర్ట్ ను, ప్రభుత్వ యంత్రాంగంను తప్పుదారి పట్టిస్తూ సదరు బిల్డర్ చట్ట వ్యతిరేకంగా పనులు చేపట్టడంపై స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. బహిరంగంగా చట్టాలకు సవాల్ విసురుతూ ప్రభుత్వ సీజ్ ను తొలగించిన బిల్డర్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి,అక్రమ నిర్మాణం పనులు నిలిపి వేసి తిరిగి బిల్డింగ్ ను సీజ్ చెయ్యాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

స్పందించని సర్కిల్ ఏసీపీ ప్రసీదా..

అయితే సదరు అక్రమ నిర్మాణంపై నిజాంపేట్ సర్కిల్ ఏసీపీ ప్రసీదాని వివరణ కొరకు ఫోన్ ద్వారా సంప్రదించగా స్పందించడం లేదు.